
నైరుతి రుతుపవనాలు మందస్తుగా ప్రవేశించడంతో ఈ సారి వర్షాకాలం ముందుగానే వచ్చిందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే భారీగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరింది. వారంపది రోజులు వర్షాలతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాల జోరు కొనసాగింది. రైతులు కూడా ముందస్తుగానే పంటలు వేయడం ప్రారంభించారు. అయితే రుతు పవనాలు వచ్చినా.. రోహిణి కార్తె ఎండలు తప్పవంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
ALSO READ | రైతులకు గుడ్ న్యూస్ : 120 రోజుల్లో పంట వచ్చే .. కొత్త రకం వరి విత్తనాలు విడుదల
ముందుగా వచ్చిన వానాకాలానికి కాస్త బ్రేక్ పడినట్లైంది. ఋతుపవనాల కదలిక ఈశాన్య భారతదేశం వైపు చురుగ్గా ఉండటంతో , దక్షిణ రాష్ట్రాల్లో రుతుపవనాల కదలిక మందగించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు తగ్గి ఎండలు మళ్లీ పెరగనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు (మే 31, జూన్ 1) తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆ తర్వాత ఋతుపవనాల కదిలిక మరింత మందగించే అవకాశంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు కాస్త బ్రేక్ ఉండనుందని తెలిపారు. ప్రస్తుతం సాధారణ కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ మొదటి వారంలో తిరిగి రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి వేస్తుండడంతో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ (మే 31) భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ హైదరాబాదు, రంగారెడ్డి మహబూబ్ నగర్, నారాయణపేట , నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు గ్రీన్ అలర్ట్ సూచించారు. మిగతా అన్ని జిల్లాల్లో పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అయితో రోహిణీ కార్తె అంటే రోళ్లు పగిలేలా ఎండలు కొడతాయని సాధారణంగా మాట్లాడుకుంటారు. అంటే ఈ కార్తెలో ఎండలు తీవ్రంగా ఉంటాయని అభిప్రాయం. కానీ ఈ సారి రుతుపవనాలు ముందుగా ప్రవేశించడంతో వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లబడుతూ వస్తోంది. దీంతో ఈ సారి ఎండలు అంతగా ఉండవని అనుకున్నారు. కానీ రుతుపవనాలు కాస్త బ్రేక్ ఇవ్వటంతో రోహిణీ ఎండలు మళ్లీ మొదలవుతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.
2025 లో రోహిణి కార్తె మే 25 నుంచి జూన్ 8 వరకు ఉంది. వాతావరణ కేంద్రం ప్రకారం సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో మరో వారం పది రోజులు ఎండలు మండే అవకాశంఉందని అంటున్నారు అధికారులు.