యాదాద్రి ఘాట్ రోడ్డులో లారీ బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం

యాదాద్రి ఘాట్ రోడ్డులో లారీ బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం

యాదాద్రి భువనగిరి జిల్లా :  ఇటీవల వర్షానికి దెబ్బతిని కుంగిన రోడ్డు మరమ్మత్తు పనుల్లో అపశ్రుతి జరిగింది. సిమెంట్ మిక్సర్ లారీ బోల్తాపడి ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్డు గోడ కూలిన ప్రదేశంలో పని చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రదేశంలో పని చేస్తున్న ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలకాగా ఆసుపత్రికి తరలించారు. ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా 2 నెలల క్రితం యాదగిరిగుట్టలో వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా యాదాద్రి ఆలయ పరిసరాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయ పనుల్లో నాణ్యాతాలోపం బయటపడింది. వర్షానికి ఘాట్ రోడ్డు కొన్ని చోట్ల కుంగిపోయింది. క్యూలైన్ కాంపెక్ల్స్‌లలో పూర్తిగా నీళ్లు నిలిచిపోయాయి. 

కొత్తగా నిర్మించిన ఆలయ కొత్త ఘాట్‌ రోడ్డు ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డు ఈ వర్షం కారణంగా కుంగి కోతకు గురైంది. కొత్తగా వేసిన ఘాట్ రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అటు వైపు నుంచి వాహనాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు.భారీగా కురిసిన వర్షం కారణంగా కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు బురదమయం కావడంతో బస్సులు బురదలో దిగబడ్డాయి. ఈ క్రమంలోనే మరమ్మత్తు పనులు చేస్తుండగా రోడ్డు కుంగడంతోనే అదుపుతప్పి  సిమెంట్ మిక్సర్ లారీ బోల్తా పడిందని చెబుతున్నారు స్థానికులు.