రైలు కిందకు దూకబోయిన ప్రేమ జంట.. క్షణాల్లో కాపాడిన పోలీసులు

రైలు కిందకు దూకబోయిన ప్రేమ జంట.. క్షణాల్లో కాపాడిన పోలీసులు

ఆ యువజంట ప్రేమించుకుంది.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకోరనే భయంతో.. ఇద్దరూ  కులాంతక వివాహం  చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే   ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కడప  రైల్వేస్టేషనులో  జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

రాయచోటికి చెందిన   యువ జంట ఇటీవలే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు.  అప్పుడు బాగానే ఉందామనుకున్నారు.  కాని జీవితం అంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో  ఆర్థిక సమస్యలతో పడరాని పాట్లు పడుతున్నారు.  ఇక జీవించలేమనుకున్నారో .. ఏమో తెలియదు కాని   కుటుంబ సమస్యలతో ఇద్దరూ  ఆత్మహత్య చేసుకోవాలని   నిర్ణయం తీసుకున్నారు. 

 ఆ ప్రేమజంట కడప రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ప్లాట్ ఫామ్ పై  అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు.  ఈ విషయాన్ని అక్కడ ఉన్న  వన్ టౌన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఎ.ప్రభు గుర్తించి  అప్రమత్తమయ్యారు. వెంటనే రైల్వే స్టేషన్ సమీపంలో విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది కి సమాచారమిచ్చారు.   అప్పటికే రైలు పట్టాల వైపు వెళ్తున్న ఆ జంటను    రైల్వే స్టేషన్ కు చేరుకున్న బ్లూ కోల్ట్ సిబ్బంది...  ఇద్దరినీ ఆపి ప్రాణాలు రక్షించారు. వారి వివరాలు తెలుసుకొన్నారు. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారికి జీవితం ఎంత విలువైందో వివరించారు. అనంతరం  వారిని దిశ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బంధువులకు అప్పగించారు. తమ పిల్లలను కాపాడిన పోలీస్ శాఖ కు జీవితాంతం ఋణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన ప్రేమికులను కాపాడిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఎ. ప్రభు, బ్లూ కోల్ట్  హెడ్ కానిస్టేబుల్ ఆనంద్,SEB హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అభినందించారు.