తుర్కియేలో భారీ భూకంపం..రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదు 

తుర్కియేలో భారీ భూకంపం..రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదు 
  • పలు సిటీల్లో ప్రకంపనలు.. కూలిన భవనాలు  

అంకారా: తుర్కియేలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 7.53 గంటలకు రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఇస్తాంబుల్, బలికెసిర్, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు వచ్చాయి. పలు సిటీల్లో భవనాలు కుప్పకూలాయి. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం బలికెసిర్ సిటీకి 51 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్టు అధికారులు ప్రకటించారు.

భూకంపం తర్వాత కొన్ని నిమిషాలకు అనేక ప్రాంతాల్లో 4.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు. పలు సిటీల్లో అనేక భవనాలు కుప్పకూలినట్టు స్థానిక మీడియా విజువల్స్ ప్రసారం చేసింది. అయితే, ఇప్పటివరకూ ప్రాణనష్టం జరిగినట్టుగా ఎలాంటి సమాచారం అందలేదని, ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తుర్కియే ప్రభుత్వం వెల్లడించింది.