పరిగి, వెలుగు: ఇంట్లో కరెంట్ రాకపోవడంతో వైర్ సరిచేసేందుకు స్తంభం ఎక్కిన ఓ వ్యక్తి.. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని హన్మనాయక్ తండాకు చెందిన నేనవత్ రాంచందర్ (51) సోమవారం రాత్రి తన ఇంట్లో విద్యుత్ సరఫరా రాకపోవడంతో, వైరును సరిచేసేందుకు కరెంట్ స్తంభం ఎక్కాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి స్పాట్లోనే చనిపోయాడు. కాగా, మూడు రోజుల కింద వీచిన ఈదురుగాలులకు తండాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, విద్యుత్ అధికారులు వచ్చి వైర్లను సరిచేసినప్పటికీ ఇంకా కొన్ని ఇండ్లకు కరెంట్ రావడం లేదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే రాంచందర్ స్వయంగా స్తంభం ఎక్కి ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కుల్కచర్ల ఎస్సై రమేశ్ కుమార్ తెలిపారు.
