
సిద్దిపేట రూరల్, వెలుగు : కరెంట్ షాక్‌తో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామ శివారులో బుధవారం జరిగింది. రూరల్ ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి కోళ్లఫామ్‌లో వరంగల్‌కు చెందిన ఆవుల రాజు (26) పనిచేస్తూ భార్యాపిల్లలతో అక్కడే ఉంటున్నాడు.
బుధవారం నిచ్చెన వేసుకొని కోళ్ల షెడ్‌కు కవర్ చుట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిచ్చెన ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన అతడి భార్య వెంటనే రోడ్డుపైకి పరుగెత్తుకొచ్చి, అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న రూరల్ పోలీసులకు చెప్పింది. వారు ఘటనాస్థలానికి చేరుకొని రాజుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండాపోయింది.