అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటీ... అని పాడుకుంటున్నాడో కొత్త పెళ్ళికొడుకు. సర్పంచి కావాలని కలలు గన్న ఆ యువకుడికి ఊరిలో రిజర్వేషన్ కలిసి రాలేదు. దీంతో.. ఏ రిజర్వేషన్ వచ్చిందో ఆ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుని సర్పంచిగా చేస్తే.. తానే ఊరిలో పెద్దగా చలామణి కావచ్చనుకున్నాడు. అలాగే పెళ్లి చేసుకున్నాడు... కానీ ప్లాన్ మాత్రం సక్సెస్ కాలేదు. ఈ విషయం కాస్తా అందరికీ తెలియడంతో తనను ఎగతాళి చేస్తారన్న భయంతో అతడు మాత్రం తాను సర్పంచి పదవి కోసం పెళ్లి చేసుకోవడం లేదంటున్నాడట. ఇంతకూ ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామానికి చెందిన ముచ్చె శంకర్ అనే వ్యక్తి చాలా కాలంగా గ్రామ సర్పంచ్ అవ్వాలనే కోరిక ఉంది. రాజకీయాల మీద ఆసక్తి, గ్రామంలో మంచి ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు. నాయకత్వ గుణాలు ఉన్న అతనికి పంచాయితీ రిజర్వేషన్లు కలిసి రాలేదు. ఎందుకంటే నాగిరెడ్డి పూర్ ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో.. శంకర్ కు ఓ ఐడియా వచ్చింది. ఎలాగూ తనకు పెళ్లి కాలేదు కాబట్టి.. ఓ ఎస్సీ యువతిని పెళ్లి చేసుకుంటే… ఆమెను సర్పంచి చేసి.. తాను కూడా ఆ పదవి ద్వారా తన కలను నెరవేర్చుకోవాలని అనుకున్నాడు.
ఆమె పేరుతో నామినేషన్ వేయించి గెలిచాక.. తన వెనుక నుంచి నాయకత్వం వహించొచ్చని ప్లాన్ వేసాడు. ఇదే ఆలోచనతో నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎస్సీ మహిళను చూసి హడావుడిగా పెళ్లి చేసుకున్నాడు. గత మంగళవారం ఎన్నికల షెడ్యూలు రాగా.. బుధవారం ఆలయంలో పెళ్లి కార్యకం పూర్తిచేశాడు. ఇక తన భార్య సర్పంచి ఐపోయినట్లేననుకున్నాడు.
కాని ఇక్కడే అతడు పప్పులో కాలేశాడు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ గ్రామ ఓటరు లిస్టులో పేరుండాలి. కానీ భార్య పేరు ఓటరు జాబితాలో చేర్పించడం మరిచిపోయాడు. పెళ్లికి ముందే ఆమె పేరు ఓటర్ లిస్ట్‌లో చేర్చుకోవాలన్న ప్రాసెస్ తెలుసుకోలేకపోయాడు. తీరా ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసరికి గడువు తీరిపోయింది. పెళ్లి సర్టిఫికేట్ చేతిలో ఉన్నా… ఆమెకి ఓటర్ లిస్ట్‌లో పేరే లేకపోవడంతో నామినేషన్ వేయలేని పరిస్థితి. దీంతో.. శంకర్ పరిస్థితి ఎలా అయిందంటే.. ప్లాన్ సెట్, పెళ్లి సెట్… కానీ ఓటర్ లిస్ట్ లో పేరు మాత్రం సెట్ కాలేదన్నట్లుగా మారిపోయింది.
అదేదో సినిమాలో చెప్పుకున్నట్లుగా.. ఎన్నెన్నో అనుకుంటాం... అన్నట్లుగా సర్పంచ్ కావాలనుకున్న శంకర్ ళ్లికొడుకు మాత్రమే అయ్యాడు. సర్పంచి పదవి దక్కకపోయినా.. ఆదర్శ వివాహం చేసుకుని ఊరిలో మంచిపేరైతే తెచ్చుకున్నాడు. శంకర్ తాను సర్పంచి కాలేకపోయినా.. తన సతీమణి ద్వారానైనా ఆ కోరిక నెరవేర్చుకోవాలనుకోవడం తప్పేమీ కాకపోయినా.. ఇప్పుడు ఆయన మాత్రం తన పెళ్లికీ, ఎన్నికలకు సంబంధం లేదని చెబుతున్నాడట
