MBBS చేయకుండా.. 70 వేల ఆపరేషన్లు

MBBS చేయకుండా.. 70 వేల ఆపరేషన్లు

శంకర్ దాదా MBBS సినిమా చూసే ఉంటారు కదా.! నకిలీ సర్టిఫికెట్లతో MBBS లో సీటు సంపాదించి డాక్టర్ గా చెలామణీ అవుతుంటాడు అందులో హీరో. ఆ సినిమాను ఇన్సిపిరేషన్ గా తీసుకున్నాడో ఏమో గానీ ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ వ్యక్తి అలా నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారమెత్తాడు. అలా డాక్టర్ నని చెప్పుకుంటూ తన పదేళ్ల సర్వీస్ లో ఒకటి కాదు రెండు కాదు..   ఏకంగా 70,000 ఆపరేషన్లు చేసి, చివరకి పోలీసుల చేతికి అడ్డంగా దొరికిపోయాడు.

ఓ డాక్టర్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి

యూపీలోని సహరన్ పూర్ కి చెందిన ఓం పాల్ శర్మ..  రాజేశ్. ఆర్ అనే వ్యక్తి యొక్క MBBS సర్టిఫికెట్లను మార్ఫింగ్ చేసి తన సర్టిఫికెట్లగా నమ్మించాడు.  రాజేశ్, ఓం పాల్ 2000 సంవత్సరంలో మంగుళూరులోని ఓ వైమానికి దళానికి చెందిన ఆసుపత్రిలో పనిచేసే వారు. ఆ ఆసుపత్రిలో ఓ పారామెడిక్ గా పనిచేస్తున్న ఓం పాల్ కి  డాక్టర్ రాజేష్ తో పరిచయం. కొంతకాలం తర్వాత రాజేష్ విదేశాలకు వెళ్లడంతో అతని సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి అతని ఫోటో స్థానంలో తన ఫోటోని రిప్లేస్ చేసి నకిలీ పత్రాలను సంపాదించాడు.

ఆసుపత్రి పెట్టి 70 వేల ఆపరేషన్లు

ఆ సర్టిఫికెట్ల ఆధారంగా డియోబంద్ సిహెచ్‌సిలో సర్జన్ ఉద్యోగం పొందడమే కాక,  తాను ఓ ఫేమస్  సర్జర్ అని చెప్పుకోవడానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ను మరియు డిప్లొమాలను కూడా పొందాడు. అందులో రెండు యుఎస్ బేస్డ్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. ఇలా డాక్టర్ రాజేశ్ గా పేరు మార్చుకొని సహరన్ పూర్ లో నర్సింగ్ హోమ్ పెట్టి తన ఆసుపత్రికి వచ్చే రోగులకు 70 వేల ఆపరేషన్లు చేశాడు.

ఇలా దొరికిపోయాడు

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఓం పాల్ నకిలీ డాక్టర్ అనే విషయం తన వల్లే తెలిసింది. డాక్టర్ రాజేశ్ గా పేరు మార్చుకున్న ఓం పాల్ కథంతా తెలిసిన ఓ అపరిచిత వ్యక్తి.. ఓం పాల్ కి కాల్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని లేదంటే గుట్టు అంతా బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే పదేళ్లుగా అదే ప్రాంతంలో ఫేమస్ డాక్టర్ గా పేరు తెచ్చుకున్న ఓం పాల్ అతని బెదిరింపులను లెక్క చేయకుండా అతనిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. పదేళ్లుగా వైద్యం చేస్తున్నాడు కాబట్టి పోలీసులు కూడా తనను అనుమానించరని అనుకున్నాడు.

కానీ పోలీసులు ఆ బ్లాక్ మెయిల్ కాల్ ఆధారంగా రాజేశ్ అనే పిలువబడే ఓం పాల్ యొక్క చరిత్ర మొత్తం బయటకు లాగారు. అతను ఎక్కడ? ఎలా? తన MBBS చేశాడనే విషయాన్ని ఆధారాలతో సహా కనుగొన్నారు. తమ దర్యాప్తులో ఓం పాల్ నకిలీ డాక్టర్ అని తేలడంతో అతన్ని అరెస్ట్ చేశామని సహారన్ పూర్ రూరల్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు.

A man, Om Pal Sharma, who did ‘thousands of surgeries’ using fake degree arrested