- కామాంధుడికి కన్నతల్లి సహకారం
- లైంగిక వాంఛ తీర్చుకొని ఫొటోలు, వీడియోలు
- ఆపై వాటితో బ్లాక్ మెయిల్
- చేస్తూ లక్షల్లో డబ్బులు వసూల్
- ఇప్పటికే ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ఆజాద్ అరెస్ట్
- సహకరించిన తల్లి, మామ, మరో ముగ్గురు కూడా
జూబ్లీహిల్స్, వెలుగు:ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలను వలలో వేసుకుని, వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు లక్షల్లో డబ్బులు దోచుకున్న చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో మరో ఐదుగురిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
గత రెండు రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న ఆజాద్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతని తల్లి మీనా కుమారి, మామ ప్రశాంత్‌తో పాటు గచ్చిబౌలికి చెందిన హేమంత్, వినీల్, జితేందర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చంద్రశేఖర్ ఆజాద్ నిర్వహించిన నేర కార్యకలాపాలకు అతని తల్లి మీనా కుమారి సహా ఈ నలుగురు ప్రత్యక్ష సహకారం అందించినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
రిచ్ బాయ్‌లా రీల్స్.. లైక్ కొట్టిన బాలికలే టార్గెట్..
మియాపూర్ కు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ బీటెక్ చదివాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే కోరికతో ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకున్నాడు. రిచ్ బాయ్‌లా కాస్ట్యూమ్స్ ధరిస్తూ కలర్ ఫుల్ రీల్స్ చేస్తూ డబ్బున్న అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు సిద్ధపడ్డాడు. ఒకరోజు పబ్బు, మరొక రోజు లగ్జరీ హోటల్, టూర్స్ వంటి లొకేషన్లలో రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవాడు.
చంద్రశేఖర్ పోస్ట్ చేసిన రీల్స్‌కు లైక్ చేసిన బాలికలను టార్గెట్ చేసి వారితో దగ్గరయ్యే ప్రయత్నం చేసేవాడు. ఇలా పరిచయమైన బాలికలతో మొదట స్నేహమని చెప్పి, ఆ తరువాత ప్రేమ పేరుతో నమ్మించి వారితో శారీరక సంబంధాలు పెట్టుకునేవాడు.
కోరిక తీర్చుకున్నాక.. డబ్బులు వసూల్
అతని కోరిక తీరిన తర్వాత, అప్పటికే తన వద్ద ఉన్న బాలికల సన్నిహిత ఫొటోలు, వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా పదుల సంఖ్యలో బాలికలను ట్రాప్ చేసి డబ్బు గుంజుకున్నాడు. ఈ క్రమంలో గత నెలలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మైనర్ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, ఆమె వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజాడు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యుల సహకారంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మైనర్ బాలికలపై ప్రేమ వల వేసి ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మొదట చంద్రశేఖర్ ఆజాద్‌ను, అనంతరం మరో నిందితుడు రాజును రిమాండ్‌కు తరలించారు. చంద్రశేఖర్ ఆజాద్ తల్లి మీనాకుమారి సహా మరో నలుగురు ఈ నేరాలు చేసేందుకు ప్రోత్సహించినట్లు తేలడంతో వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
