
- రెండేండ్ల తర్వాత దొరికిన హంతకుడు
- ఆధార్ లేదు, సెల్ ఫోన్ వాడడు
- చివరికి పోలీసుల స్కెచ్‌కు చిక్కిండు
వికారాబాద్, వెలుగు: అప్పుగా తీసుకున్న రూ. 2 వేలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిని కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో రెండేండ్ల తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఈ కేసు వివరాలను తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి శనివారం తన ఆఫీస్ లో వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మద్నూర్‌కు చెందిన బాలాజీ రెండేళ్ల కింద వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని మన్‌సాన్ పల్లిలో పొలంలో పనిచేసేందుకు వచ్చాడు. అప్పట్లో బాలాజీకి మన్సాన్పల్లికి చెందిన ముడావత్ రవితో స్నేహం ఏర్పడింది.
రవి వద్ద బాలాజీ అప్పుడప్పుడు డబ్బులు అప్పుగా తీసుకునే వాడు. రవి ఇచ్చిన అప్పులు రూ. 2 వేల వరకు చేరింది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని బాలాజీని రవి అడిగాడు. బాలాజీ ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండే వాడు. రవి సహనం కోల్పోయి గ్రామస్తుల ముందు బాలాజీని తిట్టేశాడు. దీంతో రవిపై కక్ష పెంచుకున్న బాలాజీ 2023 ఆగస్టు 12న కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
కుటుంబ సభ్యుల మీద నిఘా పెట్టి..
నిందితుడి గురించి అతని స్వగ్రామంలో విచారించగా, బాలాజీకి ఆధార్ కార్డు లేదని, బ్యాంకు ఖాతా లేదని, సెల్ ఫోన్ కూడా వాడడని గుర్తించారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యుల మీద నిఘా ఉంచారు. కొన్నాళ్ల కిందట తల్లి మృతి చెందిన కూడా బాలాజీ గ్రామానికి రాలేదు. అతని భార్య, పిల్లలు కూడా వదిలేసి వెళ్లిపోయారు.
ఇటీవలే సంగారెడ్డిలో ఉన్న సోదరుని ఇంటికి బాలాజీ వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు నేరం అంగీకరించాడు. కేసు చేధించిన పోలీస్ సిబ్బంది అంజద్, శివ, మున్నయ్యను డీఎస్పీ అభినందించారు.