ఈతకువెళ్లి తండ్రీకొడుకు మృతి

ఈతకువెళ్లి తండ్రీకొడుకు మృతి

తిమ్మాపూర్/గన్నేరువరం, వెలుగు :  కొడుకులకు ఈత నేర్పేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఒక కొడుకుతో పాటు నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన కరీంనగర్‌‌‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌‌‌ మండలంలోని వచ్చునూరు లోయర్‌‌‌‌ మానేరు డ్యాం వద్ద బుధవారం జరిగింది. వచ్చునూరుకు చెందిన చాడ రంగారెడ్డి (46) గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లిలోని ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌కే స్కూల్‌‌‌‌ కరస్పాండెంట్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. తన ఇద్దరు కొడుకులు జయ కౌశిక్‌‌‌‌రెడ్డి, జయ చైతన్యానంద రెడ్డి (9)కి ఈత నేర్పేందుకు బుధవారం మానేరు రిజర్వాయర్‌‌‌‌ వద్దకు వెళ్లాడు. 

కౌశిక్‌‌‌‌రెడ్డి ఒడ్డున కూర్చోగా చైతన్యానందరెడ్డి, రంగారెడ్డి నీటిలోకి దిగారు. రంగారెడ్డి కాస్త పక్కకు వెళ్లగానే చైతన్యానందరెడ్డి నీటిలో మునిగిపోతూ కేకలు వేశాడు. గమనించిన కౌశిక్‌‌‌‌రెడ్డి తండ్రికి చెప్పడంతో అతడు చైతన్యానందరెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో ఇద్దరూ చనిపోయాడు. గమనించిన జాలర్లు నీటిలోకి దిగి రంగారెడ్డి, చైతన్యానందరెడ్డి డెడ్‌‌‌‌బాడీలను బయటకు తీశారు. రంగారెడ్డి అన్న సత్యనారాయణరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చేరాలు తెలిపారు.