ఢిల్లీలో 144 సెక్షన్​.. ట్రాక్టర్లు, ట్రాలీల ఎంట్రీపై నిషేధం

ఢిల్లీలో 144 సెక్షన్​..     ట్రాక్టర్లు, ట్రాలీల ఎంట్రీపై నిషేధం
  •     లౌడ్ స్పీకర్లు, ధర్నాలపై ఆంక్షలు
  •     ఎంఎస్పీ కోసం రైతుల ఆందోళన
  •     నేడు పార్లమెంట్ ముందు నిరసన

న్యూఢిల్లీ :  కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్ కు పిలుపునిచ్చాయి. దీంతో సిటీ బార్డర్​లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా ఎంట్రీ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్లు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ బ్లాక్స్, కంటైనర్లు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 12 వరకు ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. 

నెల రోజుల పాటు సిటీలోకి రైతుల ట్రాక్టర్లు, ట్రాలర్స్, ట్రక్కులు, ట్రాలీలకు ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్‌, యాసిడ్, బ్యానర్లు, రాడ్లు, సోడా బాటిళ్ల వంటివి తీసుకురావడంపై కూడా నిషేధం విధించారు. లౌడ్‌ స్పీకర్ల వాడకంపైనా ఆంక్షలు విధించారు. మంగళవారం పార్లమెంట్ ముందు నిరసన చేపట్టాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్​కేఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం)తో పాటు మొత్తం 200కు పైగా రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో మార్చ్’కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బార్డర్​లో ఉన్న సింఘు, ఘాజీపూర్, టిక్రి వద్ద పెద్ద సంఖ్యలో పారా మిలటరీ బలగాలను మోహరించింది.

సిటీ సరిహద్దులన్నీ  క్లోజ్

ర్యాలీలు, ధర్నాలు, సభలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. శాంతి, భద్రతల సమస్య తలెత్తవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సిటీ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. డ్రోన్లతో రైతుల కదలికలపై నిఘా పెట్టారు. సిటీలోకి ఎంటర్ అయ్యే ప్రతి వెహికల్​ను చెక్ చేశాకే వదులుతున్నారు. పోలీసులను మోహరించడం, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. హర్యానా రూరల్ రోడ్లను కూడా మూసివేశారు. ఢిల్లీ – రోహతక్, ఢిల్లీ – బహదుర్​గఢ్ రోడ్లపై కేంద్ర బలగాలను మోహరించారు. సోమవారం వరకు కమర్షియల్ వెహికల్స్​పైనే ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. మంగళవారం నుంచి నెల రోజుల పాటు అన్ని వాహనాలకు రిస్ట్రిక్షన్స్ వర్తిస్తాయన్నారు. బార్డర్ వద్ద సుమారు 5వేల మంది పోలీసులను మోహరించారు.

ఎక్కడికక్కడ రైతుల అరెస్ట్​లు

‘ఢిల్లీ చలో మార్చ్’లో పంజాబ్, ఉత్తర​ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, కేరళ, కర్నాటక రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంట్ వైపు వెళ్లేందుకు వేలాది మంది రైతులు ఢిల్లీ బార్డర్​కు చేరుకుంటున్నారు. సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో కర్నాటక నుంచి ఢిల్లీ వెళ్తున్న 70 మంది రైతులను మధ్యప్రదేశ్​లోని భోపాల్ రైల్వే స్టేషన్​లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల చర్యను రైతులు ఖండించారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2,500 ట్రాక్టర్లలో 20 వేలమంది రైతులు ఢిల్లీకి వచ్చే ప్లాన్ చేశారు. కాగా, రైతులను అదుపులోకి తీసుకోవడాన్ని సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఖండించారు. వెంటనే వాళ్లందరినీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రుల చర్చలు

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతులపై నమోదైన కేసులతో పాటు పలు డిమాండ్లపై రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్ సోమవారం చండీగఢ్​కు వచ్చారు. మహాత్మా గాంధీ స్టేట్ ఇని​స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్​లో భేటీ అయ్యారు. డిమాండ్లపై చర్చించారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన మొదటి దఫా చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు ఢిల్లీ చలో మార్చ్​కు పిలుపునిచ్చాయి.