
- జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్
నల్గొండ అర్బన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, ఇండ్ల నిర్మాణాల పురోగతిలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా ఆఫీసర్లకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్ విషెస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో జరిగిన ప్రోగ్రాంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజకుమార్ ను అభినందించి, ల్యాప్ టాప్ , ప్రశంసా పత్రాన్ని అందజేశారు. నల్గొండ జిల్లాకు మొత్తం 19,625 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించగా 17247 గృహాలను మంజూరు చేసింది. ఇప్పటివరకు 13,581 గృహాలు గ్రౌండ్ కాగా, వాటిలో 10116 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి.
వీటిలో కొన్ని గృహాలు పూర్తయ్యాయి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే జిల్లాలో 5919 గృహాలు గ్రౌండ్ అయ్యాయి. సెప్టెంబర్ నెలలో జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు రూ.80 కోట్లు చెల్లించారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దరఖాస్తుల పరిశీలన, మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, చెల్లింపులలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా 2 వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నారాయణపేట జిల్లా ఉంది. ఇందిరమ్మ ఇండ్లలో జిల్లా రెండో స్థానంలో నిలవడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ ను శాలువాతో సన్మానించారు.