
గత ఏడాది ధనత్రయోదశికి కేజీ వెండి రేటు రూ.లక్ష దగ్గరగా ఉంది. కానీ కేవలం ఏడాదిలోనే రేట్లు డబుల్ కావటంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రూ.2లక్షలకు పైనే కేజీ వెండి ధర కొనసాగుతోంది. పైగా గత పది రోజులుగానే వెండి రేటు కేజీకి రూ.10వేలకు పైగా పెరగటంతో చాలా మందిలో భవిష్యత్తులో కొనలేమనే ఆందోళనలు పెరిగి అవసరానికి మించి కొనటం ప్రారంభించారు. దీంతో కొన్ని చోట్ల వ్యాపారులు కూడా ఔటాఫ్ స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే నిపుణులు మాత్రం వెండి కొనాలనుకుంటున్న వారు దీపావళి తర్వాత వరకు ఆగటం మంచిదని సూచిస్తున్నారు. దీనికి అదనంగా ధనత్రయోదశికి రెండు రోజుల ముందు నుంచి వెండి తగ్గుతోంది. కేజీకి ఏకంగా రూ.5వేలు తగ్గింది కేవలం రెండు రోజుల్లోనే. ఇదంతా చూస్తుంటే నిపుణుల మాట నిజమే అనిపిస్తోంది పెట్టుబడిదారులకు, ప్రజలకు. గడచిన ఏడాదిగా ప్రజలు పెరుగుతున్న ధరల నుంచి సంపదను కాపాడుకునేందుకు హెడ్జింగ్ కోసం వెండిని ఎక్కువగా వాడుతున్నట్లు తేలింది. దీనికి తోడు పారిశ్రామిక అవసరాలకు కూడా వెండి వాడకం పెరగటం మరో ప్రధాన కారణం.
సమీప కాలంలో వెండి రేట్లు దిగొస్తాయా..?
త్వరలోనే వెండి రేట్లు దిగొస్తాయని నిపుణులు అంటున్నారు. తాత్కాలికంగానైనా రేట్ల పతనం ఉంటుందని వారి అంచనా. దీపావళి తర్వాత కొనుగోలుదారుల హడావిడి తగ్గటం ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు. డాలర్ బలపడటం నుంచి లాభాల స్వీకరణ, గ్లోబల్ టెన్షన్స్ తగ్గటం వరకు రేట్లను తగ్గిస్తాయని రిలయన్స్ సెక్యూరిటీస్ ప్రతినిధి జిగర్ త్రివేది చెబుతున్నారు. వాణిజ్య యుద్ధం తగ్గుదల నుంచి పారిశ్రామిక డిమాండ్ తగ్గుదల వరకు రేట్లను అదుపులోకి తెస్తాయని వారు చెబుతున్నారు.
మరోపక్క దేశీయ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ మాత్రం దీర్ఘకాలంలో రేట్ల పెరుగుదల కొనసాగుతూనే ఉంటుందని చెబుతోంది. 2027 నాటికి కేజీ వెండి రేటు రూ.2లక్షల 50వేల వరకు చేరొచ్చని ఈ మధ్యతలో పతనాలు కూడా ఉంటాయన్నారు. మెుత్తానికి బంగారం కంటే వెండి భారీగా పెరగటంతో రేట్లు తగ్గినప్పుడల్లా వీలైనంత కొనుక్కోవటం మంచిదని నిపుణులు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు.
భవిష్యత్తులో ఈవీ రంగంతో పాటు సెమీకండక్టర్ల సెక్టార్లు నెమ్మదిస్తే అది వెండికి డిమాండ్ తగ్గించి రేట్ల పతనానికి దారితీస్తుందని తేలింది. అలాగే పరిశ్రమలు వెండికి ప్రత్యామ్నాయ మెటల్స్ వాడకం దిశగా నడిస్తే కూడా సిల్వర్ రేట్లలో తగ్గుదల ఉంటుందని తెలుస్తోంది. వెండి రేట్ల గత చరిత్రను పరిశీలిస్తే.. 1980, 2011, 2021లో భారీగా పెరిగాయి. కానీ ప్రస్తుతం ఎక్కువగా పారిశ్రామిక వినియోగం రేట్లను పెరుగుదలలో కీలకంగా మారింది. మెుత్తానికి పండగ తర్వాత 10-20 శాతం మధ్య కరెక్షన్ సాధ్యమేనని అంచనాలు ఉన్నాయి.