ఎల్లారెడ్డిపేటలో మరింత ముదిరిన ఫేస్​బుక్​ పోస్ట్​ గొడవ

ఎల్లారెడ్డిపేటలో మరింత ముదిరిన ఫేస్​బుక్​ పోస్ట్​ గొడవ
  • టీఆర్​ఎస్​ వర్సెస్​ బీజేపీ
  • ఎల్లారెడ్డిపేటలో మరింత ముదిరిన ఫేస్​బుక్​ పోస్ట్​ గొడవ
  • 23  మంది బీజేపీ నేతలను అరెస్ట్​  చేసిన పోలీసులు
  • టీఆర్​ఎస్​ నేత తోట ఆగయ్య ఇంటిపై దాడి చేశారంటూ కేసు
  • గాయపడిన బీజేపీ నేతలను వేరే ఆస్పత్రికి మార్చిన పోలీసులు
  • ఎక్కడకు తీసుకెళ్లారో చెప్పాలంటూ బీజేపీ నేతల డిమాండ్​
  • ఎల్లారెడ్డిపేటలో మంత్రి గంగుల, ఎమ్మెల్యేల ర్యాలీ, రాస్తారోకో
  • బీజేపీ నేతలపై దాడులు తమకు పెద్ద విషయం కాదంటూ గంగుల వార్నింగ్​

రాజన్నసిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ, టీఆర్ఎస్​ మధ్య గొడవ మరింత ముదిరింది. దాడులకు పాల్పడిన టీఆర్​ఎస్​ నేతలను వదిలేసి.. 23 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. టీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటి మీద దాడి చేశారంటూ వారిపై కేసు నమోదు చేశారు. టీఆర్​ఎస్​ నేతల దాడిలో గాయపడి సిరిసిల్ల సివిల్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నేతలను పోలీసులు వేరే ఆస్పత్రికి తరలించారు. ఇటు బీజేపీకి వ్యతిరేకంగా మంత్రి గంగుల కమలాకర్​ నేతృత్వంలోని టీఆర్​ఎస్​ శ్రేణులు ఎల్లారెడ్డి పేటలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డిపేటలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పదిర గ్రామానికి చెందిన సాయికుమార్​ అనే వ్యక్తి కేరళలో ఉంటూ టీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా ఫేస్​బుక్​లో పెట్టిన పోస్ట్​ శుక్రవారం గొడవకు దారితీసింది. సాయికుమార్​ ఇంటికెళ్లి అతడి తల్లిని టీఆర్​ఎస్​ నేతలు బెదిరించగా.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీజేపీ నేతలపై ఠాణాలోనే టీఆర్​ఎస్​ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటి వద్ద ఆందోళన చేసేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.  

టీఆర్​ఎస్​ నేతల రాస్తారోకో
తోట ఆగయ్య ఇంటిపై దాడి చేశారంటూ టీఆర్​ఎస్​ కార్యకర్తలు శనివారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేశారు. మంత్రి గంగుల​, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్​లు ఆగయ్యను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, జిల్లా కార్యదర్శి రెడ్డిబోయిన గోపిలపై గంగుల మండిపడ్డారు. తాము తలచుకుంటే బీజేపీ నేతలపై దాడులు చేయడం పెద్ద విషయం కాదని హెచ్చరించారు. కానీ, దాడులు చేయడం తమ సంస్కృతి కాదని చెప్పారు. టీఆర్​ఎస్​ ముందు బీజేపీ బలం సరిపోదన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ మరో బీహార్, యూపీలా మార్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతలు తుపాకులు, కర్రలు పట్టుకుని దాడులు చేస్తున్నారన్నారు. తర్వాత ఎల్లారెడ్డిపేటలో బైక్​ ర్యాలీ తీశారు. సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎల్లారెడ్డిపేట ఠాణావైపు టీఆర్​ఎస్​ నేతలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. టీఆర్​ఎస్​ నేతల ఫిర్యాదుతో రెడ్డిబోయిన గోపి వెపన్​ లైసెన్స్​ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

ప్రశ్నిస్తే కేసులు పెట్టించి జైలుకు పంపుతున్నరు: బీజేపీ
టీఆర్​ఎస్​ నేతల దాడి గురించి తెలిసి బాధితులను పరామర్శించేందుకు బీజేపీ నేతలు సిరిసిల్ల జిల్లాకు వెళ్లారు. మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్, శ్రీశైలం, సంగప్ప, కటకం మృత్యుంజయం, ఆవునూరి రమాకాంతరావులు.. సిరిసిల్ల హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న రామచంద్రం, ఏలేందర్​లను పరామర్శించేందుకు వెళ్లారు. అప్పటికే పోలీసులు వారిని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలిసింది. పోలీసులు ఎలా తీసుకెళ్తారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై సర్కార్​ అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి చంద్రశేఖర్​ మండిపడ్డారు. దాడులు చేసే సంస్కృతి బీజేపీకి లేదన్నారు. బీజేపీ నేతలపైనే టీఆర్​ఎస్​ వాళ్లు దాడులు చేస్తున్నారన్నారని, వారిని అరెస్ట్​ చేయకుండా.. బీజేపీ నేతలను అరెస్ట్​ చేశారన్నారు. పోలీసులు గులాబీ కండువాలేసుకుని డ్యూటీ చేసే పరిస్థితులున్నాయన్నారు. ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిన వారిని ఎక్కడ పెట్టారో చెప్పాలని, లేదంటే కోర్టుకెళ్తామని హెచ్చరించారు. ఠాణాలో దాడికి పాల్పడిన తోట ఆగయ్యతో పాటు టీఆర్​ఎస్​ నాయకులను అరెస్ట్​ చేయాలని, బీజేపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని జిల్లా ఎస్పీ బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.