తల్లిని అవమానించాడని.. పదేండ్లు వెతికి మరీ చంపేశాడు

తల్లిని అవమానించాడని.. పదేండ్లు వెతికి మరీ చంపేశాడు
  •     ఫ్రెండ్స్ కు ఇచ్చిన పార్టీతో పోలీసులకు చిక్కిన నిందితుడు
  •     యూపీలో సినిమా కథను మించిన రివేంజ్ మర్డర్

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌‌‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తన తల్లిని అవమానించిన వ్యక్తిని పదేండ్ల పాటు వెతికి మరీ చంపి పగతీర్చుకున్నాడు. హత్య తర్వాత  ఫ్రెండ్స్​కు ఇచ్చిన మందు పార్టీతో పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. సినిమా కథను మించిన ఈ రివేంజ్ మర్డర్ స్టోరీ ప్రస్తుతం లక్నోలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  2015లో మనోజ్ అనే వ్యక్తి సోను కశ్యప్ అనే యువకుడి తల్లిని కొట్టి, అవమానించాడు. ఈ ఘటన అప్పట్లో 11 ఏండ్ల వయసున్న సోనును తీవ్రంగా కలచివేసింది. తన తల్లికి జరిగిన అవమానాన్ని సహించలేక మనోజ్‌‌‌‌పై పగతీర్చుకోవాలని సోను నిర్ణయించుకున్నాడు. దాడి తర్వాత మనోజ్ ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయాడు. కానీ, సోను మాత్రం తన పగను మర్చిపోలేదు. లక్నో  వీధుల్లో పదేండ్లపాటు మనోజ్ కోసం గాలించాడు. మూడు నెలల కిందటే..మనోజ్ లక్నోలోని మున్షీ పులియా ప్రాంతంలో కొబ్బరి బోండాలు అమ్ముతున్నట్లు సోను తెలుసుకున్నాడు. అప్పటి నుంచి మనోజ్‌‌‌‌ను నీడలా వెంబడించాడు. అతడి రోజువారీ కార్యకలాపాలను, షెడ్యూల్‌‌‌‌ను గమనించాడు. అతడ్ని హత్య చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఈ కుట్ర అమలు చేయడానికి తన స్నేహితులైన రంజీత్, ఆదిల్, సలాము, రెహ్మత్ అలీల సాయం కోరాడు. హత్య తర్వాత గ్రాండ్​గా పార్టీ ఇస్తానని వారికి ప్రామిస్​ చేశాడు.

నిందితులను పట్టించిన సోషల్ మీడియా.. 

మే 22న రాత్రి మనోజ్ తన షాప్ మూసేసి ఒంటరిగా ఇంటికి బయలుదేరాడు. కల్యాణ్‌‌‌‌పూర్‌‌‌‌లోని మన్మీత్ డైరీ సమీపంలో అతనిపై సోను, అతని నలుగురు ఫ్రెండ్స్ ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మనోజ్‌‌‌‌..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ హత్య సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినప్పటికీ, చీకట్లో దాడి చేయటం వల్ల నిందితులను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే, హత్య తర్వాత ఇచ్చిన మాట ప్రకారం.. సోను తన ఫ్రెండ్స్​కు గ్రాండ్​గా మద్యం పార్టీ ఇచ్చాడు. పార్టీలో తీసిన ఫొటోలను ఐదుగురిలో ఒకడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌లో కనిపించిన ఓ నిందితుడి టీ-షర్ట్‌‌‌‌.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలోని యువకుడి టీషర్ట్​తో మ్యాచ్ అయింది. దీంతో మనోజ్‌‌‌‌ను చంపింది ఈ ఐదుగురేనని గుర్తించిన పోలీసులు.. జులై 20న సోను కశ్యప్, రంజీత్, ఆదిల్, సలాము, రెహ్మత్ అలీలను అరెస్ట్ చేశారు. ఐరన్ రాడ్, బైక్ స్వాధీనం చేసుకున్నారు.