వీధి కుక్కలకు కొత్త రోగం

వీధి కుక్కలకు కొత్త రోగం

మహబూబ్​నగర్​, వెలుగు: పశువులకు లంపీ స్కిన్​ వైరస్​ సోకినట్టే.. వీధి కుక్కలు కొత్త రోగంతో బక్కచిక్కి పోతున్నాయి. వాటి శరీరంపై ఉన్న బొచ్చు ఊడిపోతోంది. ఈ వ్యాధి ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వెటర్నరీ ఆఫీసర్ల లెక్కల ప్రకారం ఒక్క పాలమూరు జిల్లాలోనే 12 వేల వీధి కుక్కలు ఉన్నాయి. వీటిలో చాలా కుక్కలు ‘ప్యారాసైట్​ ఇన్ఫెస్టేషన్’ రోగం బారిన పడ్డాయి. ఈ వ్యాధి కుక్కలపై రెండు రకాలుగా ప్రభావం చూపుతోంది. వాటి శరీరంపై బొచ్చు ఊడిపోయి గజ్జి మాదిరిగా తయారవుతున్నాయి. బొచ్చు ఊడిపోయిన చోట చిన్న చిన్న పుండ్లు ఏర్పడుతున్నాయి. బక్కగా చిక్కిపోయి నీరసంగా కనిపిస్తున్నాయి. రెండో రకం లక్షణాలు కొన్ని కుక్కల్లోనే కనిపిస్తాయని, వాటి కడుపులు, లివర్​లో ఇన్​ఫెక్షన్లు ఏర్పడతాయని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి బారిన పడిన కుక్కల పేళ్లు ఒక దాని నుంచి మరోదానికి చేరడం వల్ల వ్యాధి వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. 

ట్రీట్​మెంట్​ చేస్తలేరు

వివిధ ప్రాంతాలకు జంతువులను రవాణా చేసేటపుడు బయో సెక్యూరిటీ మెజర్స్​కచ్చితంగా పాటించాలని వెటర్నరీ ఆఫీసర్లు చెబుతున్నారు. అప్పుడే ఏ ఇన్​ఫెక్షన్​ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం సులభమవుతుందని అంటున్నారు. స్థానికంగా ఉన్న చెక్​పోస్టులే తప్ప మన ప్రాంతాల్లో బయో సెక్యూరిటీ మెజర్స్​ పాటించకపోవడం వల్లే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు. వ్యాధి బారిన పడుతున్న వీధి కుక్కలకు ట్రీట్​మెంట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కేవలం ఆనిమల్​ బర్త్​ కంట్రోల్(ఏబీసీ) ప్రోగ్రామ్​ మాత్రమే నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడుతున్న కుక్కలు చనిపోకున్నా, వాటి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. 

దాదాపు ఆరు నెలల పాటు ఈ వైరస్​ వాటి శరీరంపై ప్రభావం చూపుతుంది. ప్రతి నెలా లేదా మూడు నెలలకోసారి మెడిసిన్​ డీవార్మింగ్స్​ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రోత్​ టానిక్​లు, లివర్​ టానిక్​లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, మెడిసిన్​ల సప్లై గవర్నమెంట్​నుంచి పీహెచ్​సీలకు జరగడం లేదని తెలిసింది. కేవలం పెట్​ డాగ్స్​ఉన్న ఓనర్లే ముందస్తుగా ఇలాంటి మెడిసిన్​లు ఇస్తున్నారు. వీధి కుక్కల్లో ఈ వ్యాధిని నివారించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాటిని పట్టుకొని వెటర్నరీ హాస్పిటల్స్​కు తరలించాల్సి ఉండగా, గ్రామ పంచాయతీ, మున్సిపల్​ వర్కర్లు పట్టించుకోవడం లేదు.

చూస్తేనే భయం వేస్తోంది

మా ఊళ్లో చాలా రోజులుగా కుక్కల శరీరం మీద ఉన్న బొచ్చు రాలిపోతోంది. రాలిపోయిన చోట పురుగులు ఉంటున్నాయి. ఆ కుక్కలను చూస్తేనే భయం వేస్తోంది. అవి వస్తున్నాయంటేనే దూరంగా వెళ్లిపోతున్నాం. పిల్లలు, ముసలోళ్ల మీద దాడి చేస్తే ఏమన్నా  అవుతుందేమోనని ఆందోళనగా ఉంది. ఈ కుక్కలకు ఎవరూ ట్రీట్​మెంట్​ చేస్తలేరు. కనీసం ఊరి ఆవల విడిచిపెడితేనన్నా బాగుండు.
– రమేశ్, పోతన్​పల్లి గ్రామం, మహబూబ్​నగర్​ జిల్లా