- ఇందుకోసం మూడు రకాల ప్లాన్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్
- అసెంబ్లీ ఆవరణ చుట్టూ ఉన్న పాత బిల్డింగ్స్ కూల్చి పూలు, ఇతర మొక్కల పెంపకం
- ఇప్పటికే ముగింపు దశకు కౌన్సిల్ భవనం పునర్నిర్మాణ పనులు
హైదరాబాద్, వెలుగు:
అసెంబ్లీకి త్వరలోనే కొత్త రూపు రానుంది. ఇప్పటికే అసెంబ్లీ ఆవరణ బయట జూబ్లీ హాల్ లో ఉన్న శాసన మండలిని అసెంబ్లీలోని పాత భవనంలోకి తరలించారు. దీంతో కౌన్సిల్ భవనానికి సరికొత్త హంగులను అద్దుతున్నారు. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరున, లేదంటే వచ్చే నెలలో జరగనున్నాయి. ఈసారి కౌన్సిల్ సమావేశాలను పాత అసెంబ్లీ భవనంలో నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలే ఆయన స్వయంగా మండలి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఇకపై ఒకే ప్రాంగణంలో ఇటు శాసన సభ అటు శాసన మండలి సమావేశాలు జరగనుండడంతో కొత్త శోభ రానుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీకి కొత్త రూపు ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ రెండు సభల మధ్య పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణంపై ఆయన దృష్టి సారించారు. సమావేశాలు జరిగే సమయంలో ఇటు ఎమ్మెల్యేలు అటు ఎమ్మెల్సీలు కలిసి కూర్చొని మాట్లాడుకునేందుకు వీలుగా ఈ సెంట్రల్ హాల్ ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మూడు రకాల ప్లాన్ లను ఆర్ అండ్ బీ అధికారులు రెడీ చేశారు. త్వరలోనే ఈ మూడింటిలో ఒక ప్లాన్ ను సీఎం రేవంత్ ఫైనల్ చేయనున్నారు.
పాత నిర్మాణాలు పడగొట్ట.. పచ్చిక బయళ్లు
ఇక రెండో దశలో అసెంబ్లీ ఆవరణ మొత్తాన్ని పూర్తిగా పచ్చిక బయళ్లతో ఆహ్లాదకరంగా మార్చనున్నారు. రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లను పెంచాలని, నీడనిచ్చే చెట్లకూ ప్రాధాన్యమివ్వాలని ఇప్పటికే సీఎం సూచించారు. అందులో భాగంగానే ప్రస్తుతం అసెంబ్లీ ఆవరణలో ఉన్న అన్ని పార్టీల సీఎల్పీ ఆఫీసులను, చీఫ్ విప్ కార్యాలయాన్ని, ప్రింటింగ్ ప్రెస్, అసెంబ్లీ క్యాంటీన్ , మీడియా పాయింట్ నిర్మాణాలన్నింటినీ తొలగించి చదును చేయనున్నారు. ఉద్యానవనం తీర్చిదిద్దాక అసెంబ్లీ ఆవరణ దరిదాపుల్లోకి వాహనాలను అనుమతించకుండా కేవలం కాలినడకనే తరలి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
మంత్రులు, సభ్యులు, అధికారుల వాహనాల పార్కింగ్ కోసం జూబ్లీహాల్ ను ఆనుకొని ఉద్యానవన శాఖ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని, నర్సరీ ఉన్న ప్రాంతాన్ని వినియోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వాహనాలు ఎక్కువైతే ప్రత్యేకించి హైడ్రాలిక్ టవర్లను ఏర్పాటు చేసి, మల్టీ లెవల్ పార్కింగ్ చేపట్టాలని ప్లాన్చేస్తున్నారు. ఇక జూబ్లీహాల్ వారసత్వ కట్టడం అయినందున దాన్ని అలాగే కొనసాగించాలని భావిస్తున్నారు. పబ్లిక్ గార్డెన్ లో ఇందిరా ప్రియ దర్శిని ఆడిటోరియం, జవహర్ బాల భవన్, హెల్త్ మ్యూజియం వంటివి ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో వాటి స్థానంలో సీఎల్పీ కార్యాలయాల నిర్మాణం, అసెంబ్లీకి సంబంధించిన పాలనా పరమైన ఇతర అవసరాల కోసం అక్కడ కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
శాసనసభ, మండలికి వేర్వేరు కార్యదర్శులు
శాసనసభ, శాసన మండలికి వేర్వేరుగా కార్యదర్శులు నియమించాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో ఆయన సమావేశమయ్యారు. రెండు సభలకు వేర్వేరు కార్యదర్శులను నియమించే విషయంపై చర్చించి ఇద్దరు కార్యదర్శుల నియామకానికి సంబంధించిన ఫైల్ ను ఆమోదం కోసం చీఫ్ సెక్రటరీ వద్దకు పంపించారు.
త్వరలోనే ఇద్దరు కార్యదర్శులను నియమిస్తూ సెక్రటేరియెట్ నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులును మండలి కార్యదర్శిగా నియమించి, మాజీ లా సెక్రటరీ రెండ్ల తిరుపతి పేరును అసెంబ్లీ కార్యదర్శి కోసం పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నర్సింహాచార్యులు శాసనసభ, మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈయన అసెంబ్లీ వ్యవహారాలపైనే దృష్టి పెట్టి, మండలి సమావేశాలకు డిప్యూటీ సెక్రటరీలను పంపిస్తున్నారు. దీంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వేర్వేరుగా కార్యదర్శులను నియమించాలని సీఎం నిర్ణయించినట్లు చెప్తున్నారు.
