
- ఈనెల 26న డీఏవో ఎగ్జామ్
- అదే రోజూ ఎస్ఎస్సీ, కేంద్రీయ విద్యాలయ రిక్రూట్మెంట్, ఎయిర్ ఫోర్స్ పరీక్షలు
- ఆందోళనలో నిరుద్యోగ అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగులకు కొత్త సమస్య వచ్చి పడింది. ఒకే రోజు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ పరీక్షలు ఉండటంతో ఏ పరీక్ష రాయోలో అర్థంకాక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నెల 26న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ పరీక్షకు 1,06,263 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్ కూడా అదే రోజు ఉంది. మరోపక్క కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పీఆర్టీ పరీక్షలు ఈ నెల 21 నుంచి 28 వరకు కొనసాగనున్నాయి. అదే విధంగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్సీఏటీ) పరీక్షలూ 24 నుంచి 26 వరకు ఉన్నాయి. దీంతో నాలుగు పరీక్షలూ ఒకే రోజు ఉండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. వీటికితోడు యూజీసీ నెట్ కూడా ఉందని చెప్తున్నారు. ఏండ్ల తరబడి నోటిఫికేషన్లు రాక.. వచ్చిన వాటికి ఇలాంటి సమస్యలు రావడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీఏవో పరీక్షకు లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో చాలామంది మిగిలిన పరీక్షలు కూడా రాసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఏ ఎగ్జామ్ రాయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. సెంట్రల్ పోస్టుల తేదీలు ఎలాగూ మార్చరు.. కనీసం స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే పరీక్షనైనా మార్చాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు.
డీఏవో ఎగ్జామ్ వాయిదా వేయాలి
రాష్ట్రంలో ఈ నెల 26న జరిగే డివిజినల్ అ కౌంట్స్ ఆఫీసర్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. చాలారోజులుగా కమిషన్ ఫిర్యాదుల విభాగానికి ఫోన్‌చేసి చెప్తున్నా సరైన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు అన్ని పరీక్షలు రాయడం వీలుకాదు కాబట్టి డీఏవో పరీక్ష వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఇంకా దీనిపై టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.