టీ20 ఫార్మాట్‌‌‌‌లో చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ!

టీ20 ఫార్మాట్‌‌‌‌లో చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ!

న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ–2025కి కొత్త చిక్కు వచ్చి పడింది. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో టాప్‌‌‌‌–8 జట్లు అర్హత సాధిస్తాయని ఐసీసీ ఇప్పటికే ప్రకటించినా.. ఫార్మాట్‌‌‌‌పైనే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. ప్రస్తుత వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా ఆడే మ్యాచ్‌‌‌‌లకు మాత్రమే విపరీతమైన ప్రేక్షకాదరణ వస్తున్నది. మిగతా మ్యాచ్‌‌‌‌లను ఫ్యాన్స్‌‌‌‌ పెద్దగా పట్టించుకోవడం లేదు. 

సగానికిపైగా స్టేడియాలు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో గేట్‌‌‌‌ రెవెన్యూ, యాడ్‌‌‌‌ రెవెన్యూ భారీగా తగ్గిపోతున్నది.  ఫలితంగా రాబోయే రోజుల్లో వన్డే ఫార్మాట్‌‌‌‌కు మరింత ఆదరణ తగ్గే అవకాశాలు ఉన్నాయని బ్రాడ్‌‌‌‌కాస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీని వన్డే మాదిరిగా కాకుండా టీ20 ఫార్మాట్‌‌‌‌లో నిర్వహించాలని ఐసీసీపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 

అయితే 2024లో టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ జరగనుంది. ఆ తర్వాతి ఏడాదిలోనే చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీని ఇదే ఫార్మాట్‌‌‌‌లో నిర్వహించడం సరైందేనా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఫార్మాట్‌‌‌‌ను మార్చాలని ఇప్పటి వరకు ఎవరూ ఐసీసీని అధికారికంగా అభ్యర్థించలేదని తెలుస్తోంది.