ఇవాళో..రేపో.. ఓపెనింగ్.. ఇంతలోనే వరదల్లో కొట్టుకుపోయింది..!

ఇవాళో..రేపో.. ఓపెనింగ్.. ఇంతలోనే వరదల్లో కొట్టుకుపోయింది..!

జైపూర్: ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర రహదారి కొట్టుకుపోయిన ఘటన రాజస్తాన్లో జరిగింది. రాజస్తాన్లో ఆదివారం కురిసిన కుండపోత వర్షానికి కట్లీ నది ప్రవాహం అమాంతం పెరిగింది. 86 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కావడంతో ఝుంఝును జిల్లాలో భారీ వృక్షాలు నేలకూలాయి. వాగులువంకలు పొంగి పొర్లుతుండటంతో పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఆరు నెలల క్రితం బఘూ, జహంజ్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నేషనల్ హైవే 52ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండగా భారీ వర్షాలు, వరదలకు రోడ్డు కోసుకుపోయి మధ్యలోకి తెగిపోయింది.

ఆదివారం ఒక్కరోజు కురిసిన వర్షానికి కట్లీ నది పొంగిపొర్లి ఈ రహదారిని ముంచెత్తింది. గంటల పాటు ఆ వరద ఉధృతంగా ప్రవహించడంతో రహదారి కొట్టుకుపోయింది. ఒక్క రహదారి మాత్రమే కాదు ఆ రహదారి పక్కనే ఉన్న కరెంట్ స్థంభం కూడా వరద ఉధృతికి నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇంత ‘లో’ క్వాలిటీతో రహదారి నిర్మాణంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ : జూరాల 14 గేట్లు ఓపెన్ .. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి విడుదల