బిహార్ నుంచి వచ్చి .. గంజాయి అమ్ముతున్నడు

బిహార్ నుంచి వచ్చి .. గంజాయి అమ్ముతున్నడు
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన  ఎస్వోటీ పోలీసులు
  • 580 గ్రాముల గంజాయి, 5 సెల్​ఫోన్లు,రూ.4500 నగదు స్వాధీనం 

చేవెళ్ల,వెలుగు : గంజాయి అమ్ముతున్న ఓ యువకుడిని, కొనేందుకు వచ్చిన మరొకరిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన మొయినాబాద్ పీఎస్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ పవన్​కుమార్​రెడ్డి తెలిపిన ప్రకారం.. బిహార్ లోని మొర్కాహీ గ్రామానికి చెందిన సౌరబ్ కుమార్​ యాదవ్ (20) బతుకు దెరువుకు ఏడాది కింట మొయినాబాద్ వచ్చాడు.  తోలుకట్ట శివారులో చనువెళ్లి రాంచందర్ వ్యవసాయ పొలంలోని రేకుల షెడ్ లో అద్దెకు ఉంటున్నాడు. 

తోలుకట్ట గేట్ సమీపంలో మాణిక్యం  వెల్డింగ్ షాపులో పని చేస్తున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నాడు.  వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేసే వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గంజాయికి అలవాటుపడిన వారిని గుర్తించాడు.  బిహార్​లోని సుబోధ్​సింగ్​ అలియాస్ సుబోధ్​ ఖోప్రియా అనే వ్యక్తి నుంచి గంజాయి,  చాక్లెట్ల ప్యాకెట్లు కొనుగోలు చేసి తెచ్చి అమ్ముతున్నాడు. సమాచారం అందడంతో రాజేంద్రనగర్ ఎస్​ఓటీ పోలీసులు వెళ్లి సౌరబ్ కుమార్​ యాదవ్ ను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. 

అలాగే గంజాయి కొనడానికి వచ్చిన పాత నేరస్తుడు ముజ్తాబా అలీఖాన్ అలియాస్ ప్రిన్స్​ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతను సెల్ ఫోన్లు చోరీలు చేస్తూ 10 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బిహార్ చెందిన ముజ్తాబా అలీఖాన్  లంగర్ హౌస్ లోని బాగ్దాద్​ కాలనీలో ఉంటున్నాడు. రూ.80 వేల విలువైన గంజాయిని పట్టుకున్నారు. 580 గ్రాముల గంజాయితో పాటు 92 చాక్లెట్ ప్యాకెట్లు, తయారు చేసే మెషీన్, రూ.4800 నగదు, 5 సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.