పులి ఎక్కడ ? కామారెడ్డి జిల్లాలోనే ఉందా..? సిద్దిపేట వైపు వెళ్లిందా !

పులి ఎక్కడ ? కామారెడ్డి జిల్లాలోనే ఉందా..? సిద్దిపేట వైపు వెళ్లిందా !

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో 20 రోజుల కింద పులి సంచారం కలకలం రేపింది. వారం నుంచి పది రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి కదలికలు కనిపించగా, ఆ తర్వాత దాని జాడ కనిపించలేదు.  దీంతో ఆ పులి ప్రస్తుతం ఎటు వైపు వెళ్లిందనే అంశంపై సందిగ్ధత నెలకొంది. నాలుగు రోజుల కింద సిద్దిపేట జిల్లాలో పులి సంచరించిన ఆనవాళ్లు లభించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో తిరిగిన పులి బార్డర్ గుండా సిద్దిపేట జిల్లా వైపు వెళ్లి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రెండు జిల్లాల్లో కనిపించిన పులులు ఒకటేనా? లేక వేర్వేరు పులులా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో సేకరించిన పులి పాదముద్రలను, సిద్దిపేట జిల్లాలో లభించిన పాదముద్రలతో సరిపోల్చి పరిశీలించనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 

ఆరు నెలల కింద ఉమ్మడి జిల్లాలో పులి సంచారం.. 

ఆరు నెలల కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో పులి కదలికలు గుర్తించారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై పులి దాడి చేసింది. అప్పట్లో ఏర్పాటు చేసిన ట్రాక్​కెమెరాల్లో పులి ఆనవాళ్లు రికార్డయ్యాయి. 

ఆవును చంపిన చోట కొందరు వ్యక్తులు పులిపై విషప్రయోగానికి ప్రయత్నించగా, ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్​చేశారు. కొంతకాలం పాటు అక్కడక్కడ పులి కదలికలు కనిపించినా, ఆ తర్వాత దాని జాడ పూర్తిగా కనుమరుగైంది. చివరకు కవ్వాల్ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు అధికారులు అంచనా వేశారు. 

ఈ నెలలో మరో పులి సంచారం.. 

ఈ నెల 12న దోమకొండ మండలం అంబారిపేటలో ఓ ఆవుపై పులి దాడి చేయడంతో మరోసారి కలకలం రేగింది. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా, అందులో పులి కదలికలు రికార్డయ్యాయి. ఈ పులి మంచిర్యాల జిల్లా కవ్వాల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు నిర్ధారించారు.

 వారం రోజుల పాటు దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, మాచారెడ్డి మండలాల్లోని పలు గ్రామాల్లో పులి సంచరించిన ఆనవాళ్లు లభించాయి. పలుచోట్ల ఆవులపై దాడులు జరిగాయి. చివరగా మాచారెడ్డి మండలం ఇసాయిపేట అటవీ ప్రాంతంలో పులి ఆవుపై దాడి చేసిన తర్వాత దాని జాడ కనిపించలేదు. 

సిద్దిపేట జిల్లాలో తాజా కదలికలు..  

కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న సిద్దిపేట జిల్లాలో నాలుగు రోజుల క్రితం పులి సంచరించిన ఆనవాళ్లు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. గతంలో కామారెడ్డి జిల్లాలో పులి సంచరించిన ప్రాంతాలు సిద్దిపేట, సిరిసిల్లా జిల్లాలకు సరిహద్దుగా ఉండటంతో, పులి అక్కడికి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు.

 రెండు జిల్లాల్లో లభించిన పాదముద్రలు ఒకేలా ఉంటే, కామారెడ్డి జిల్లాలో సంచరించిన పులి సిద్దిపేట వైపు వెళ్లినట్లు నిర్ధారణ కానుంది. ఒకవేళ పాదముద్రలు వేర్వేరుగా ఉంటే, కామారెడ్డి జిల్లాలో సంచరించిన పులి ఎటు వెళ్లిందన్న అంశంపై అధికారులు మరింత విచారణ చేపట్టనున్నారు. 

పాదముద్రలను పరిశీలిస్తాం 

కామారెడ్డి జిల్లాలో సంచరించిన పులి సిద్దిపేట వైపు వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నాం. అక్కడ నాలుగు రోజుల క్రితం పులి ఆనవాళ్లు కనిపించాయి. రెండు జిల్లాల్లోని పాదముద్రలను సరిపోల్చి పరిశీలిస్తాం. ఈ జిల్లాలో పులి కదలికలను గుర్తించేందుకు ఇంకా ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశాం.- నిఖిత, కామారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి