ఎలాంటి భూ సమస్య ఉన్నా జిల్లా స్థాయిలోనే పరిష్కరిస్తున్నాం : మంత్రి పొంగులేటి

ఎలాంటి భూ సమస్య ఉన్నా  జిల్లా స్థాయిలోనే పరిష్కరిస్తున్నాం : మంత్రి పొంగులేటి
  • తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చే దిశగా రెవెన్యూ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. గత ఏడాది తరహాలోనే కొత్త సంవత్సరంలోను ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను సోమవారం హైదరాబాద్‌‌‌‌లో మంత్రి ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ‘భూభారతి’ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఎలాంటి భూ సమస్య ఉన్నా జిల్లా స్థాయిలోనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టామని చెప్పారు.   

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: లచ్చిరెడ్డి

రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మంత్రిని కోరారు. ప్రధానంగా అన్ని స్థాయిల ఉద్యోగుల పదోన్నతులు, తహసీల్దార్ల వాహనాల పెండింగ్ బిల్లుల మంజూరు తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారు.