న్యూఢిల్లీ: ఇటీవల ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన త్రిపుర ఎంబీఎ స్టూడెంట్ అంజెల్ చక్మా(24) హత్యను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది "భయంకరమైన ద్వేషపూరిత నేరం" అంటూ పేర్కొన్న ఆయన.. దేశంలో ఇలాంటి ద్వేషాన్ని బీజేపీ నాయకత్వం సాధారణీకరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా రాహుల్ స్పందించారు.
"డెహ్రాడూన్‌లో అంజెల్ చక్మా, అతని సోదరుడు మైకేల్‌కు జరిగినది ఓ భయంకరమైన ద్వేషపూరిత నేరం. ఇలాంటి ద్వేషం రాత్రికి రాత్రే పుట్టదు. గత కొన్నేండ్లుగా విషపూరిత కంటెంట్, బాధ్యతారహిత కథనాల ద్వారా మన యువతకు రోజూ ద్వేషమనే ఆహారం అందిస్తున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వం దీన్ని సాధారణంగా మార్చేస్తోంది" అని మండిపడ్డారు. గౌరవం, ఐక్యతపై భారతదేశం నిర్మితమైందని గుర్తు చేసిన రాహుల్.. మనది ప్రేమ, వైవిధ్యం ఉన్న దేశమని స్పష్టం చేశారు.
