- హైదరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, సైబరాబాద్‌గా మెగా హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ
- కమిషనరేట్ల పరిధి నుంచి భువనగిరి జిల్లా మినహాయింపు
- సైబరాబాద్ సీపీగా ఎం. రమేశ్, మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, ఫ్యూచర్ సిటీకి సుధీర్ కుమార్.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: ఇటీవల ఓఆర్ఆర్వరకూ మెగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర అభివృద్ధి, విజన్-2047 లక్ష్యాలకు తగ్గట్టుగా మెగా హైదరాబాద్‌ను 4 పోలీస్ కమిషనరేట్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ)గా పునర్వ్యవస్థీకరించింది. ఇందుకు సంబంధించి నూతన పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ రాచకొండ సీపీగా ఉన్న జి. సుధీర్‌బాబు ను కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా నియమించారు.
సైబరాబాద్ సీపీగా ఉన్న అవినాశ్ మహంతిని కొత్తగా ఏర్పాటుచేసిన మల్కాజిగిరి కమిషనరేట్‌కు బదిలీ చేశారు. రాచకొండను పునర్ వ్యవస్థీకరించి ఏర్పాటు చేసినఈ మల్కాజిగిరి కొత్త సీపీగా మహంతికి అవకాశమిచ్చారు. ఐజీపీ (ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్)గా ఉన్న ఎం. రమేశ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇంతకాలం డీసీపీగా ఉన్న అక్షాంశ్‌యాదవ్‌ను బదిలీ చేసి, కమిషనరేట్ నుంచి విడదీసి ప్రత్యేక జిల్లా యూనిట్‌గా మార్చిన యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీగా నియమించారు.
హైదరాబాద్ కమిషనరేట్: అసెంబ్లీ, సెక్రటేరియెట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్ పోర్టు, బుద్వేల్ హైకోర్టులాంటి అత్యంత కీలక ప్రాంతాలు దీని పరిధిలోకి వచ్చాయి.
సైబరాబాద్ కమిషనరేట్: ఐటీ కారిడార్లు అయిన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గంతో పాటు పారిశ్రామిక ప్రాంతాలైన పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీ పురం, అమీన్ పూర్ ప్రాంతాలు ఉంటాయి.
మల్కాజిగిరి కమిషనరేట్: గతంలో ఉన్న రాచకొండ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరించి ‘మల్కాజిగిరి’గా మార్చారు. కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల కోసం కొత్తగా దీన్ని ఏర్పాటు చేశారు. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు దీని పరిధిలోకి వెళ్లాయి.
భువనగిరి మినహాయింపు
ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న భువనగిరి జోన్‌ను కమిషనరేట్ వ్యవస్థ నుంచి మినహాయించారు. దీనిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా (జిల్లా) మార్చి, దానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) స్థాయి అధికారిని నియమించారు.
