- ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లతో ఫేక్ ఐడీలు
- రూ.13 కోట్ల అక్రమ లావాదేవీల్లో రూ.3 కోట్లు ఫ్రీజ్
- 12 రోజుల కస్టడీ తరువాత జైలుకు తరలింపు
- త్వరలో మరిన్ని అరెస్టులు!
బషీర్‌బాగ్, వెలుగు: ఐబొమ్మ వెబ్సైట్ కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవిపై సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ ముగిసింది. 12 రోజుల కస్టడీ సందర్భంగా అనేక సంచలన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తన ముగ్గురు స్నేహితుల పేర్లతో నకిలీ గుర్తింపులు (ఫేక్ ఐడెంటిటీలు) సృష్టించి రవి అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
వెల్లెల ప్రహ్లాద్ కుమార్‌తో పాటు అంజయ్య, కాలి ప్రసాద్ పేర్లతో రవి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసినట్లు గుర్తించారు. కడప జిల్లాకు చెందిన వెల్లెల ప్రహ్లాద్‌తో 2007లో అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో కలిసి ఉన్న సమయంలోనే అతని టెన్త్ మెమో, ఆధార్ కార్డు వివరాలను సేకరించినట్లు సమాచారం.
ఆ వివరాలతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. పేర్లు ప్రహ్లాద్వే అయినప్పటికీ ఫొటో మాత్రం రవిదే ఉంచి నకిలీ డాక్యుమెంట్లు సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ, తన టెన్త్ క్లాస్ మేట్ అయిన కాలి ప్రసాద్ ఆధార్ కార్డు ఉపయోగించి మరికొన్ని ఫేక్ ఐడీలు రూపొందించినట్లు సమాచారం. అయితే పాస్‌పోర్ట్‌ను మాత్రం తన అసలు పేరు ఇమ్మడి రవితోనే తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ముగ్గురు స్నేహితుల పేర్లతో పలు వెబ్సైట్లను కొనుగోలు చేసి బినామీగా నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హాస్పిటల్ ఇన్, సప్లయర్స్ ఇన్ వంటి వెబ్‌సైట్లు ప్రారంభించినప్పటికీ అవి ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అనంతరం ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌ను సృష్టించినట్లు సమాచారం. బెంగళూరు నుంచి ప్రహ్లావ్ను పిలిపించి రవి ముందే విచారించిన పోలీసులు రవి ఎవరో తనకు తెలీదని పోలీసులకు ప్రహ్లాద్ తెలిపినట్లు సమాచారం.
తన పేరుతో రవి పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యానని ప్రహ్లాద్ తెలిపారు. రవి కస్టడీలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలతో లక్షల్లో లావాదేవీలు, డొమైన్ కొనుగోలు, ఐసీ మాస్క్ ఎలా చేస్తున్నారు, సర్వర్ లోడ్ కెపాసిటీ ఎంత ఇన్వెస్ట్‌మెంట్.. ఎవరెవరు సర్వర్ మైంటైన్ చేస్తున్నారు ఇలా అన్నింటిపై పోలీసులు ఆరా తీశారు. త్వరలోనే పైరసీ రాకెట్‌లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. మొత్తం రూ.13 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు అందులో రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు.
మిగిలిన రూ.10 కోట్లను విదేశాల్లో ఖర్చు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కస్టడీ ముగిసిన అనంతరం ఇమ్మడి రవిని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
