ఖాళీలు నింపండి.. నిధులు పెంచండి : యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్లు

ఖాళీలు నింపండి.. నిధులు పెంచండి : యూనివర్సిటీల  వైస్  చాన్స్ లర్లు
  •     సర్కారుకు యూనివర్సిటీ వీసీల విజ్ఞప్తి 
  •     నేషనల్ ఎడ్యుకేషన్ ​పాలసీపై స్పష్టత ఇవ్వాలని రిక్వెస్ట్ 
  •     హైదరాబాద్​లో వైస్ చాన్స్​లర్ల కీలక భేటీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వర్సిటీల అభివృద్ధికి నిధులు పెంచాలని ప్రభుత్వాన్ని వర్సిటీల వైస్ చాన్స్ లర్లు (వీసీలు) కోరారు. సోమవారం గచ్చిబౌలిలోని ‘నిథమ్’లో తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని 13 వర్సిటీలకు చెందిన వీసీల సమావేశం జరిగింది. ఈ భేటీలో యూనివర్సిటీల బలోపేతం, రిక్రూట్​మెంట్, కొత్త కోర్సులు, నిధులు, సిలబస్, ఎన్ఈపీ తదితర అంశాలపై చర్చించారు. 

విద్యారంగానికి 10% నిధులివ్వాలి

వర్సిటీల్లో మంజూరైన అన్ని టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని వీసీలు కోరారు. రిక్రూట్​మెంట్ పద్ధతి, రోస్టర్ పాయింట్ల ఖరారు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇప్పించాలని టీజీసీహెచ్ఈ దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్​పాలసీ అమలు చేయాలా వద్దా అనే దానిపై  క్లారిటీ ఇవ్వాలని కోరారు. 

ఈ పాలసీకి తగ్గట్టు వర్సిటీల చట్టాలు, ఆర్డినెన్స్​లను సమీక్షించి, రేషనలైజ్ చేయడానికి ఒక కమిటీని వేయాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీల ఆర్థిక పరిస్థితిపై ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని వీసీలు కోరారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్లు విడుదల చేయడంతో పాటు రాష్ట్ర బడ్జెట్​లో విద్యారంగానికి 10 శాతం నిధులు కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదించాలన్నారు. కాగా..రాష్ట్రంలో జీరో అడ్మిషన్లు లేదా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు నమోదైన కాలేజీలపై ఫోకస్ పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. 

ఏప్రిల్​లోపే కొత్త సిలబస్: బాలకిష్టారెడ్డి 

గ్లోబల్, ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా వినూత్న కోర్సులను తీసుకురావాలని వీసీల భేటీలో నిర్ణయించినట్టు టీజీసీహెచ్ఈ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ 3 నుంచి 6 సెమిస్టర్ల సిలబస్​ను రివిజన్ చేయాలని, ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్​ను ఏప్రిల్ లోపే సిద్ధం చేయనున్నట్టు వెల్లడించారు. యూజీ, పీజీలకు కామన్ కరికులమ్, క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ కోసం కమిటీ ఏర్పాటు చేయున్నట్టు వివరించారు. 

సమావేశంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్​కే మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఓయూ వీసీ కుమార్ , జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి, వీసీలు యాదగిరి రావు, ఆల్తాఫ్​ హుస్సేన్, ఉమేశ్ కుమార్, జీఎన్ శ్రీనివాస్, గంగాధర్, గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.