పత్తి రైతుకు తప్పని తిప్పలు.. నాణ్యత లేదంటూ సీసీఐ ధరల్లో భారీ కోత

పత్తి రైతుకు తప్పని తిప్పలు.. నాణ్యత లేదంటూ సీసీఐ ధరల్లో భారీ కోత
  • గరిష్టంగా రూ.7,800 కొనుగోలు చేస్తున్న సీపీఐ
  • ఇదే అదనుగా రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: పత్తి రైతుకు సీజన్ ​ఆరంభం నుంచి తిప్పలు తప్పడం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో చేతికి వచ్చిన కొద్దిపాటి పత్తిని అమ్ముకునేందుకు కష్టాలు పడాల్సివస్తోంది. మొదట్లో తేమ పేరుతో మద్దతు ధర దక్కలేదు, ఇప్పుడేమో నాణ్యత లేదంటూ సీసీఐ ధరల్లో కోత విధించడంతో రైతులు నష్టపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో రూ.100కు పైగా కోత పెట్టడంపై పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.

పేరుకే మద్దుతు ధర..

సీసీఐ రూ.8,010 మద్దతు ధర ఇస్తుండగా, గరిష్టంగా రూ.7,800 తో మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది 98 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేపట్టారు. అక్టోబర్ 27న జిల్లాలో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించింది. చిట్యాల మండలంలో 2, కాటారంలో 2, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 1 చొప్పున కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసింది. పత్తిలో తేమ సంగతి పక్కన పెడితే పత్తిలో నాణ్యతాప్రమాణాలు తగ్గుతున్నాయని నవంబర్​ 27న రూ.50 కోత పెట్టి రూ.8,060 ధరతో కొనుగోళ్లు చేపట్టారు. 

మళ్లీ ఈనెల 22 నుంచి మరో రూ.50 కోతపెట్టింది. ప్రస్తుతం పత్తిలో 8 శాతం తేమ ఉంటే రూ.8,010 మద్దతు కొనుగోలు చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నా, గరిష్టంగా రూ.7,800 ధర మాత్రమే పెడుతున్నట్లుగా రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సీసీఐ 1,81,480 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, ప్రైవేటు వ్యాపారులు 10,892 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేశారు. సీసీఐ నిబంధనలతో విసుగు చెందిన రైతులు నెట్ క్యాష్ ఇస్తుండడంతో ప్రైవేట్ వ్యాపారులకు రూ.7 వేలకే విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు అగ్గువకే పత్తి కొనుగోలు చేస్తూ  రైతులను ముంచుతున్నారు. 

వ్యాపారులకు సంపత్తి..

సీసీఐ నిబంధనలు రైతులకు ఇబ్బందికరంగా మారడంతో దిక్కుతోచని స్థితుల్లో గ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. రైతుల నుంచి అగ్గువకు కొనుగోలు చేసిన వ్యాపారులు కపాస్​యాప్​లో బుక్​చేసుకుని రైతుల పేరిట భూమి కాగితాలు, ఆధార్​ చూపించి లాభాలు పొందుతున్నారు. వ్యాపారులకు కొనుగోలు సెంటర్ల వద్ద కొంతమంది ఆఫీసర్లు కొమ్ముకాస్తున్నారనే విమర్శలున్నాయి. సీసీఐ తీరుతో రైతులు నష్టపోతుండగా, రైతుల నుంచి కొనుగోలు చేసి వ్యాపారం చేసే దళారులు బాగుపడుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

రైతుల్లో ఆందోళన..

అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గిందంటే ధరల్లో కోత విధించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో సీసీఐకి పత్తిని విక్రయించిన చాలామంది రైతులకు మద్దతు ధర లభించలేదు. తేమ పేరిట ధర తగ్గించడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. కొద్దిమంది నిల్వచేసుకుని ఇప్పుడు అమ్ముకుందామంటే సీసీఐ కోత విధించడంతో పాటు పత్తి బీబీ స్పెషల్ నుంచి మెక్​మోడ్ కుమారిందని నెల వ్యవధిలో రూ.100కు పైగా కోత విధించారు. 

అయినా మద్దతు ధరకు రూ.100 నుంచి రూ.200 వరకు తగ్గించి కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వానలతో ఇబ్బందులు పడి పంటను సరైన ధర వచ్చే వరకు చూసి విక్రయిద్దామంటే ఇప్పుడు నాణ్యత పేరుతో కోతలు విధిస్తున్నారని, ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.