- డైరెక్టర్ బోయపాటితో కలిసి సినిమా చూసిన కేంద్రమంత్రి
హైదరాబాద్, వెలుగు: సనాతన ధర్మం జోలికి వచ్చేవాళ్లకు, ధర్మం తప్పి ప్రవర్తించేవాళ్లకు ‘అఖండ 2’ సినిమా గట్టి గుణపాఠమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను ఈ సినిమా గుర్తుచేసిందని, ప్రతి ఒక్క హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ‘అఖండ 2 తాండవం’ సినిమాను చూశారు.
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సనాతన ధర్మం గురించి సినిమా తీయాలంటే దమ్ము కావాలని, ఆ దమ్ము బోయపాటిలో ఉందన్నారు. "ఈ దేశంపైన, మన సంస్కృతి, సంప్రదాయాలపైనా దాడులు జరుగుతున్నా తట్టుకుని నిలబడ్డామంటే.. దానికి కారణం మనం నమ్ముకున్న సనాతన ధర్మమే. బార్డర్‌లో సైనికులు దేశాన్ని రక్షిస్తే.. సమాజంలో ధర్మాన్ని మనం రక్షించుకోవాలి.
అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం కూడా తప్పే" అని బండి సంజయ్ స్పష్టం చేశారు. దేవుడు లేడు, ధర్మం లేదని తప్పుడు ప్రచారం చేసేటోళ్లకు ఈ సినిమా కనువిప్పు కావాలన్నారు. దారి తప్పిన వాళ్లంతా ఇప్పటికైనా హిందూ ధర్మం అనే గొడుగు కిందకు రావాలని కోరారు.
