తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతరకు విద్యుత్ సరఫరా పనులను జనవరి 5 వరకు పూర్తి చేయాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న విద్యుత్ పనులను సోమవారం పర్యవేక్షించారు. ముందుగా జాతర కోసం కొత్తగా నిర్మిస్తున్న నార్లాపూర్ 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. జనవరి 10 వరకు ఛార్జ్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం మేడారం టెంపుల్ వద్ద ఏర్పాటుచేసిన నాలుగు పోల్స్ స్ట్రక్చర్ పనులను పరిశీలించారు.
నిర్దేశించుకున్న పనులన్నీ వెంటవెంటనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మేడారం పార్కింగ్ కోసం ఏర్పాటు చేసే వెంగలాపూర్, చింతల్ క్రాస్, నార్లాపూర్ పార్కింగ్ స్థలాలు, స్థూపం జంక్షన్, హరిత జంక్షన్, ఆర్టీసీ జంక్షన్, కన్నెపల్లి రోడ్డు, కన్నెపల్లి సారలమ్మ దేవాలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. గట్టమ్మ ఆలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న 33/ 11 కేవీ సబ్ స్టేషన్ కూడా జాతర వరకు అందుబాటులోకి రావాలని సూచించారు. ఆయన వెంట సీపీ ఇంజినీర్ రాజు చౌహాన్, ములుగు ఎస్సీ ఆనందం, డీఈలు నాగేశ్వరరావు, సదానందం, అనిల్ కుమార్, ఈఈ సివిల్ వెంకట్రాం, ఏడీఈలు రాజేశ్, వేణుగోపాల్, సందీప్ పాటిల్ పాల్గొన్నారు.
