నల్లమలలో గుప్తనిధుల తవ్వకాలు.. 14 మందిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు

నల్లమలలో గుప్తనిధుల తవ్వకాలు.. 14 మందిని  అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు

కొల్లాపూర్, వెలుగు : నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌‌ ఫారెస్ట్‌‌ రేంజ్‌‌ పరిధిలోని ఆలయంలో గుప్త నిధుల తవ్వకానికి వచ్చిన 14 మందిని ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... కొల్లాపూర్‌‌ మండలం మొలచింతలపల్లి గ్రామానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన నల్లమల అడవిలో శివుడు కొలువైన పురాతన ఆలయం ఉంది. ఈ గుడిలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు వ్యక్తులు వాటిని తవ్వి తీసేందుకు ప్లాన్‌‌ చేశారు. ఇదిలా ఉండగా.. కొల్లాపూర్‌‌ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన బంగారయ్య మరికొందరితో కలిసి పానగల్‌‌ మండలంలో బండరాళ్లను కొడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి రాయినిపల్లి, తెల్లరాళ్లపల్లి, పానగల్‌‌కు చెందిన పలువురు పరిచయం అయ్యారు. 

దీంతో వీరితో కలిసి గుప్తనిధులు వెలికితీయాలని భావించాడు. ఇందుకోసం వారికి కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాడు. తర్వాత అందరూ కలిసి శివాలయం వద్దకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన ఫారెస్ట్‌‌ ప్రొటెక్షన్స్‌‌ వాచర్స్‌‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిఘా పెట్టిన ఆఫీసర్లు ఆదివారం రాత్రి 14 మందిని అదుపులోకి తీసుకొని కొల్లాపూర్‌‌ టింబర్‌‌ డిపోకు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నారని ఆఫీసర్లు తెలిపారు. నిందితుల నుంచి తొమ్మిది బైక్‌‌లు, 13 సెల్‌‌ఫోన్లు, ఒక జనరేటర్‌‌, రాళ్లు పగులగొట్టే మెషీన్‌‌ను స్వాధీనం చేసుకొని, 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌‌డీవో చంద్రశేఖర్‌‌ తెలిపారు.