ముత్తారం, వెలుగు: ముత్తారం, అడవి శ్రీరాంపూర్, వెంచరామి పరిధిలోని మానేరు నది అటవీ ప్రాంతంలో పులి ఆనవాళ్ల కోసం ఫారెస్ట్ అధికారులు సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల కింద మంథని మండలంలోని ఎల్.మడుగు నుంచి ఆరెంద వైపు పులి వెళ్లినట్టు ఫారెస్ట్ అధికారులు ఆనవాళ్లు గుర్తించారు.. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం జడల్‌పేట గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది.
ఈక్రమంలో మళ్లీ ముత్తారం వైపు వచ్చిందా అని గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో మానేరు నుంచి అడవి శ్రీరాంపూర్ మీదుగా మచ్చుపేట గ్రామంలోని బగుల్లగుట్ట వద్ద బర్రెలపై దాడి చేసిన విషయం తెలిసిందే. పెద్దపల్లి డీఎఫ్వో శివయ్య ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు నర్సయ్య, అఫ్జల్, పవన్, తిరుపతి గాలింపులో పాల్గొన్నారు.
