యూరియాపై ఆందోళన వద్దు..యాసంగికి సరిపడా నిల్వలు ఉన్నాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యూరియాపై ఆందోళన వద్దు..యాసంగికి సరిపడా నిల్వలు ఉన్నాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •     రైతులకు మంత్రి తుమ్మల భరోసా
  •     ఇబ్బంది లేకుండా ఎరువులు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం
  •     ఫర్టిలైజర్​ యాప్​ అమలుపై వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: యూరియాపై ఆందోళన చెందవద్దని, యాసంగి సీజన్‌‌‌‌కు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. యూరియా సరఫరా, ఫర్టిలైజర్  యాప్ అమలుపై సీఎస్, స్పెషల్ సీఎస్​లతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంత్రి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

మంత్రి మాట్లాడుతూ.. యూరియా పంపిణీలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని మంత్రి భరోసా ఇచ్చారు. రైతుల సౌకర్యార్థం వ్యవసాయ కమిషనరేట్‌‌‌‌లో టోల్‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌ 1800 599 5779 ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ యాసంగి సీజన్‌‌‌‌కు రాష్ట్రానికి కేంద్రం మొత్తం 10.40 లక్షల టన్నుల యూరియాను కేటాయించిందని తెలిపారు. 

అక్టోబర్  నుంచి డిసెంబర్  వరకు రావాల్సిన 5.60 లక్షల  టన్నుల యూరియాకు 5.70 లక్షల  టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయని వివరించారు. నిరుడు ఇదే టైంకు 2.81 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరగగా, ఈ సీజన్‌‌‌‌లో రోజుకు సగటున 8,692 టన్నుల చొప్పున మొత్తం 3.72 లక్షల టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారని తెలిపారు.

ఐదు జిల్లాల్లో యూరియా యాప్ విజయవంతం

వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్  యాప్‌‌‌‌ను ఆదిలాబాద్‌‌‌‌, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, జనగామ‌‌‌‌, నల్లగొండ‌‌‌‌, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఐదు జిల్లాల్లో ఇప్పటివరకు 82,059 మంది రైతులు యాప్  ద్వారా యూరియా బుకింగ్ చేసుకొని 2,01,789 బస్తాలను కొనుగోలు చేశారని చెప్పారు. 

యాప్ అమలుపై జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. యాప్ పై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్లు తెలిపారు. యాప్​ అమలులో లేని జిల్లాల్లో యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.  

సహకార రంగంలో దేశానికి తెలంగాణ మార్గదర్శి

సహకార సంఘాలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమయ్యాయని, దేశ సహకార రంగంలో తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజా పాలనలో రాష్ట్రంలో రైతు రాజ్యం కొనసాగుతోందని చెప్పారు. సోమవారం నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కో–ఆపరేటివ్ కాంక్లేవ్ కి మంత్రి తుమ్మల ముఖ్య​అతిథిగా హాజరై, మాట్లాడారు.