పోలీసులు పట్టించుకుంటలేరని.. ఏం చేశాడంటే

 పోలీసులు పట్టించుకుంటలేరని.. ఏం చేశాడంటే
  • భైంసాలో రైతు ఆత్మహత్యాయత్నం

భైంసా, వెలుగు: ఫిర్యాదు చేస్తే పోలీసుల న్యాయం చేస్తలేరని, కనీసం పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు పోలీస్​స్టేషన్​ఎదుట  ఆత్మహత్యకు యత్నించాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్​జిల్లా భైంసా మండలం కోతుల్ గాంకు చెందిన శైలజకు గ్రామంలో ఏడెకరాల భూమి ఉంది. ఆ భూమిని గ్రామానికి చెందిన వ్యక్తి కబ్జా చేశాడంటూ రెండు నెలల క్రితం శైలజ భర్త మల్లేశ్(38)​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆ వ్యక్తి సాగులో ఉన్న పత్తి పంటను ట్రాక్టర్​తో దున్నుతుండగా మల్లేశ్​అడ్డుకోగా అతనిపై దాడి చేశారు.

శనివారం భైంసారూరల్​పీఎస్​లో దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు తమకు న్యాయం చేయరని అంటూ పీఎస్​ ఎదుటే మల్లేశ్ ​పురుగుల మందు తాగాడు. గమనించిన పోలీసులు, కుటుంబీకులు వెంటనే భైంసా ఏరియా హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్​తీసుకెళ్లారు. తమకు పాస్​బుక్​ సైతం ఉందని, కానీ అధికారులు తమకు న్యాయం చేయడం లేదని శైలజ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. భైంసా రూరల్​ఎస్సై శ్రీకాంత్​మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.