తండా వాసికి రూ.65 వేల కరెంట్ బిల్లు

తండా వాసికి రూ.65 వేల కరెంట్ బిల్లు
  • లైన్ మన్ నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి ఆవేదన

వికారాబాద్, వెలుగు : రీడింగ్​ ఆగిపోయిన మీటర్ మార్చకపోవడంతో ఓ తండా వాసికి రూ.65 వేలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. ఇందుకు లైన్ మన్ నిర్లక్ష్యమే కారణమంటూ అతడు ఆరోపిస్తున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలంలోని సొండేపూర్ గ్రామ పంచాయతీలోని మైసమ్మ చెర్వు తండాకు చెందిన రెడ్యా నాయక్ ఇంటికి సంబంధించి 8 నెలలుగా కరెంట్ మీటర్ పనిచేయడం లేదు.

ఈ విషయాన్ని అతడు  లైన్​మన్ కు చెప్పగా.. కొత్త మీటర్ పెట్టేందుకు రూ.2 వేలు అవుతుందని చెప్పి రెడ్యానాయక్ నుంచి డబ్బు తీసుకున్నాడు. కానీ లైన్​మన్ కొత్త మీటర్ బిగించలేదు. మూడ్రోజుల కిందట  జులై నెలకు సంబంధించి రెడ్యానాయక్ ఇంటికి రూ.65, 240 బిల్లు వచ్చింది.  దీని గురించి విద్యుత్  అధికారులను అడిగితే..  బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ చేస్తామంటున్నారని  రెడ్యానాయక్ ​ఆవేదన వ్యక్తం చేశాడు.