
కంటోన్మెంట్, వెలుగు: చెట్ల కొమ్మలు నరికి రోడ్డు పక్కన వేసిన వ్యక్తికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు రూ.3 వేలు జరిమానా విధించారు. నిధుల సేకరణలో భాగంగా ఇటీవల వివిధ అంశాలపై కొత్త బైలాస్‌ను అమలులోకి తెచ్చారు. కాలనీలు, బస్తీల్లోని రోడ్లపై చెత్త వేస్తే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో చెట్ల కొమ్మలు నరికి వేసినందుకు గాను జ్యోతినగర్‌లోని ఓ వ్యక్తికి రూ.3 వేలు జరిమానా విధించారు. బోర్డు పరిధిలో శానిటేషన్ విభాగం డైలీ 200 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తోంది. 100 వెహికల్స్ లో 800 సిబ్బంది ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. కాగా కొన్ని కాలనీల్లోని జనం రోడ్లపై చెత్త వేయడాన్ని గుర్తించిన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరికొన్ని స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసి చెత్త సేకరిస్తామని చెబుతున్నారు.
కొత్త బైలాస్ ప్రకారం..
కొత్త బైలాస్ ప్రకారం.. కాలనీ సంక్షేమ, అపార్టుమెంట్ సంఘాలు, హౌజింగ్సొసైటీల్లో సొంత ఖర్చుతో రెండు రకాల డస్ట్బిన్లు కొనుగోలు చేసుకోవాలని స్పష్టం చేశారు. వాటిని ప్రధాన కూడళ్లలో అమర్చుకోవాలని తెలిపారు. రోడ్ల పక్కన ఉండే చిరువ్యాపారులు తమ షాపుల పక్కనే డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెత్త రహిత బోర్డుగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నాయంటున్న చిరువ్యాపారులు, సొంతంగా డస్ట్బిన్లు పెట్టుకోమనడం కరెక్ట్కాదంటున్నారు. జీహెచ్ఎంసీ ఉచితంగా ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇవ్వాలని కోరుతున్నారు.