ఐపీఎస్‌లు మానవ హక్కులను కాపాడాలి : ఎన్‌పీఏ డైరెక్టర్‌‌ అమిత్‌ గార్గ్‌

ఐపీఎస్‌లు మానవ హక్కులను కాపాడాలి : ఎన్‌పీఏ డైరెక్టర్‌‌ అమిత్‌ గార్గ్‌
  • ఎట్టిపరిస్థితుల్లో నైతిక విలువలు మరువొద్దు: ఎన్‌పీఏ డైరెక్టర్‌‌ అమిత్‌ గార్గ్‌
  • ఎన్‌పీఏలో 174 మందికి శిక్షణ పూర్తి
  • రాష్ట్ర కేడర్‌‌కు నలుగురు కేటాయింపు, రేపు పాసింగ్ అవుట్ పరేడ్
  • ముఖ్యఅతిథిగా హాజరుకానున్న బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ ‌దల్జిత్‌ సింగ్‌ చౌదరీ

హైదరాబాద్‌, వెలుగు: ఇండియన్ పోలీస్ సర్వీస్‌ అధికారులు మానవ హక్కులను కాపాడాలని, నైతిక విలువలు మరువొద్దని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీ ఎన్‌పీఏ) డైరెక్టర్‌‌ అమిత్‌గార్గ్‌ సూచించారు. అకాడమీలో నైతిక విలువలు, మానవ హక్కులకు సంబంధించి నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని.. కానీ, శిక్షణ పూర్తిచేసుకుని అకాడమీ నుంచి బయటకు వెళ్లిన కొంత మంది ఐపీఎస్‌లు కనీస విలువలు మర్చిపోతున్నారన్నారు. ఇలాంటి అంశాలు ఆయా పోలీస్ ఉన్నతాధికారుల పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు. 

రాజేంద్రనగర్‌ ‌శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ రెగ్యులర్ రిక్రూటీస్‌(2024 బ్యాచ్‌‌)కు చెందిన ఐపీఎస్‌లు ఫేస్‌ శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరి పాసింగ్ అవుట్​ పరేడ్ శుక్రవారం జరగనుంది. శిక్షణ పూర్తయిన వారిలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని తెలంగాణ కేడర్‌‌కు కేటాయించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్యఅతిధిగా బీఎస్‌ఎఫ్
డైరెక్టర్‌ ‌దల్జీత్‌ సింగ్‌ చౌదరి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ అమిత్‌గార్గ్‌ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

16 మంది విదేశీ పోలీస్ ఆఫీసర్లకు శిక్షణ 

217 మంది ట్రైనింగ్‌లో చేరగా 27 మంది వివిధ వివిధ సర్వీసుల్లోకి వెళ్లారని అమిత్‌గార్గ్‌ తెలిపారు. ఐపీఎస్‌కు చెందిన 174 మందికి, నేపాల్‌ రాయల్ భూటాన్‌, మాల్దీవులకు చెందిన 16 మంది పోలీస్‌ ఆఫీసర్లు కలిపి మొత్తం 190 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని చెప్పారు. పోలీస్‌ ప్రవర్తన, నైతిక విలువలు, మానవ హక్కులకు సంబంధించి నిపుణులతో తరగతులు ఇప్పించామని చెప్పారు. ఏఐ, డ్రోన్‌ టెక్నాలజీపై ట్రైనింగ్‌ ఇచ్చామన్నారు. సైబర్ క్రైమ్, వైట్ కాలర్ అఫెన్సెస్‌తో పాటు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించేందుకు చట్టాల అమలుపై దృష్టి సారించామన్నారు. ఉత్సవాల బందోబస్తులకు సంబంధించి ఫీల్డ్‌ ట్రైనింగ్‌ ఇచ్చామన్నారు. 

తెలంగాణ కేడర్కేటాయించిన ఐపీఎస్‌లు

     పేరు                                    స్వస్థలం

అయేషా ఫాతిమా                    మధ్యప్రదేశ్‌
మనీషా నెహ్రా                           రాజస్తాన్‌
మంధరె సోనం సునీల్‌            పుణె
రాహుల్ కంట్‌                          జార్ఖండ్‌