హ్యామ్ రోడ్లకు రేపే టెండ‌ర్లు.. ఏర్పాట్లు పూర్తి చేసిన పీఆర్ శాఖ‌

హ్యామ్ రోడ్లకు రేపే టెండ‌ర్లు.. ఏర్పాట్లు పూర్తి చేసిన పీఆర్ శాఖ‌
  • మొద‌టి ద‌శ‌లో 7,449  కి.మీ ర‌హ‌దారుల నిర్మాణం

హైద‌రాబాద్, వెలుగు: హైబ్రీడ్ యాన్యుయిటీ మోడ్‌ (హ్యామ్) ప్రాజెక్టుల కోసం టెండర్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానున్నది. 17 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అదేరోజు పేపర్ నోటీసు ద్వారా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి.. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నది. ఫేజ్–I లో 17 ప్యాకేజీల కింద.. 96 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,162 రహదారులు (7,449.50 కి.మీ. పొడవుతో) నిర్మించనున్నారు. హ్యామ్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ రహదారులు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. 

జాతీయ, అంతర్జాతీయ ర‌హదారి నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నుంచి మండల కేంద్రం, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రం వరకు రోడ్​ కనెక్టివిటీని పెంచేందుకు హ్యామ్​ పద్ధతిలో నిర్మాణం, అప్‌గ్రెడేషన్‌, నిర్వహణ చేపట్టేందుకు సంక‌ల్పించింది. ఈ విధానంలో ప్రాజెక్ట్ వ్యయానికి 40% ప్రభుత్వమే నిర్మాణ దశలో చెల్లిస్తుంది. మిగిలిన 60 శాతానికి కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా సమీకరిస్తారు. రహదారుల నిర్మాణం పూర్తయ్యాక 15  ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే అవుతుంది. ఈ ప్రాజెక్టును 3 దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఫేజ్ – I  కోసం టెక్నో ఎకనామిక్  ఫీజిబిలిటీ స్టడీని పూర్తి చేశారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతిపాద‌న‌ల‌కు తగ్గట్టుగా ప్రతిపాదిత ప‌నుల‌ను పంచాయ‌తీ రాజ్ ఇంజినీర్లు ఎంపిక చేశారు. ప్రభుత్వం 17 ప్యాకేజీలుగా పీఆర్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంటు సర్కిళ్ల వారీగా పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.6,294.81 కోట్లు ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక అనుమతి మంజూరైంది. దీంతో ఫేజ్ I  హ్యామ్ రోడ్ల టెండర్ల ప్రక్రియ‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమ‌తులిచ్చింది.  ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. హ్యామ్ అమలుతో గ్రామీణ రోడ్ల సదుపాయాలు మెరుగవుతాయని, దాంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు.