మహిళలకు ఫ్రీ జర్నీతో మగవాళ్లకు ఇబ్బందులు.. హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు

మహిళలకు ఫ్రీ జర్నీతో మగవాళ్లకు ఇబ్బందులు.. హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు

హైదరాబాద్, వెలుగు :  ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత డిసెంబర్‌‌‌‌ 8న జీవో 47 ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీనిని సవాల్‌‌ చేస్తూ నాగోల్‌‌కు చెందిన హరేందర్‌‌ కుమార్‌‌ హైకోర్టులో పిల్‌‌ దాఖలు చేశారు. ఆర్టీసీ కేంద్ర చట్టాల మేరకు ఏర్పాటు అయ్యిందని, కాబట్టి ఫ్రీ జర్నీపై రాష్ట్రం నిర్ణయం తీసుకునే అధికారం లేదని ఆయన పేర్కొన్నారు.

ఫ్రీ జర్నీ వల్ల అవసరం లేకపోయినా చాలా మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, దీంతో పనులపై బస్సులో ఎక్కే మగ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పిల్‌‌లో ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌‌తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు.

సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారమే యాడ్స్‌‌ ఇవ్వాలి

గవర్నమెంట్‌‌ పథకాల ప్రచారం పేరుతో వ్యక్తిగత ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం న్యూస్‌‌ పేపర్లకు యాడ్స్‌‌ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌‌పై హైకోర్టు విచారణను మూసివేసింది. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారమే ప్రభుత్వం న్యూస్ పేపర్లకు యాడ్స్‌‌ ఇవ్వాలని ఆదేశించింది. కామన్‌‌ కాజ్‌‌ వర్సెస్‌‌ యూనియన్‌‌ గవర్నమెంట్‌‌ కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రూపొందించిన గైడ్‌‌లైన్స్‌‌ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాడ్స్‌‌ ఇవ్వాలని చెప్పింది. ప్రేమ వాహిని అనే స్వచ్ఛంద సంస్థ 2010లో వేసిన పిటిషన్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.అనిల్‌‌ కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ ఇటీవల విచారణ పూర్తి చేసింది.