
బషీర్‌బాగ్/గచ్చిబౌలి/ పద్మారావునగర్, వెలుగు: జ్ఞాపకాలను పదిలంగా ఉంచేది ఫొటో మాత్రమేనని, ఫొటోను కళాత్మకంగా బంధించడం అంత సులభం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మంగళవారం తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే ఆఫీసు ఆడిటోరియంలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. దీనిని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పొన్నం ప్రారంభించారు. ఫొటో కాంటెస్ట్ లో ప్రతిభ చాటిన వారిని అభినందించారు.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ డే సందర్భంగా హైదరాబాద్ సెంటర్ ఫర్ ఫొటోగ్రఫీ అండ్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం, కల్చరల్విభాగం ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ గెస్ట్‌గా హాజరయ్యారు. పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు సంజీవ్‌కుమార్ పలువురు ఫొటో జర్నలిస్టులను సత్కరించారు.