సాగునీటి శాఖలో రెండేండ్లలో రూ.11,287 కోట్ల పనులు

సాగునీటి శాఖలో రెండేండ్లలో రూ.11,287 కోట్ల పనులు
  • ఇందులో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకే సగానికి పైగా ఖర్చు
  • గోదావరి బేసిన్ పనుల్లోనూ కదలిక

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం​అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్లలో సాగునీటి ప్రాజెక్టులపై  రూ.11,287 కోట్లు ఖర్చు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టిన ప్రాజెక్టులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సర్కారు పలు కీలక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి బేసిన్​లలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూడడంతో పాటు పదేండ్ల పాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ‘పాలమూరు-– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం జరిగిన రూ.11 వేల కోట్ల పనుల్లో సగానికి పైగా నిధులు(రూ.5,594 కోట్లు) కేవలం ఈ ఒక్క ప్రాజెక్టు పనులపైనే వెచ్చించినట్టు ఇరిగేషన్​అధికారులు చెప్తున్నారు. ‘ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టుల’ కింద మహబూబ్ నగర్ పరిధిలో రూ.1,694.61 కోట్లు, నాగర్ కర్నూల్ పరిధిలో రూ.3,900.28 కోట్ల విలువైన పనులు జరిగాయని పేర్కొంటున్నారు. 

నల్గొండ గొంతు తడిపేలా ‘డిండి’ పరుగులు

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక  కృష్ణా బేసిన్  పరిధిలో చాలాకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలిగింది. ఫ్లోరైడ్ బాధిత జిల్లాగా భావించే ఉమ్మడి నల్గొండ సాగు, తాగునీటి అవసరాలకు కీలకంగా భావించే  ‘ఎస్ ఆర్ వీ ఆర్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్’ పనుల్లోనూ సర్కారు వేగం పెంచింది. ఈ ప్రాజెక్టు కింద నల్గొండ యూనిట్ పరిధిలో ఏకంగా రూ.805.85 కోట్ల పనులు జరిగాయి. అలాగే, ఎంతో క్లిష్టమైన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులకు సంబంధించి కూడా రూ. 317.70 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్​ఇంజినీర్లు చెప్తున్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టుల పనులను కూడా కలుపుకుని కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లో మొత్తం రూ. 2,525.79 కోట్ల పనులు జరిగినట్లు ఆశాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది. 

గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌లో ‘సీతారామ’కు జీవం

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వరప్రదా యినిగా భావించే  ‘సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు’ పనులు ఊపందుకున్నాయి. గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌లో ఖర్చు చేసిన మొత్తం రూ. 1,147 కోట్ల నిధుల్లో ఎక్కువ ఈ ప్రాజెక్టుకే దక్కాయి. ఖమ్మం, కొత్తగూడెం యూనిట్ల పరిధిలో కలిపి దాదాపు రూ.813 కోట్ల మేర పనులు పూర్తి చేశారు. దీంతో పాటు శ్రీపాద ఎల్లంపల్లి, చిన్న కాళేశ్వరం, లోయర్ పెన్ గంగా వంటి ప్రాజెక్టుల పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ‘ఇతర ప్రాజెక్టుల’  జాబితాలో  సంగారెడ్డి, కామారెడ్డి, రామగుండం, గజ్వేల్, నిజామాబాద్ పరిధిలో రూ. 2,241.40 కోట్ల విలువైన కాళేశ్వరం అనుబంధ పనులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.