- వీరిలో ముగ్గురు యువతులు
- మొత్తం 14 మంది అనుమానితులకు టెస్టులు
హైదరాబాద్, వెలుగు: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో పబ్స్, ఈవెంట్లు జరిగే ప్రాంతాలపై ఈగల్ (ఎలైట్ యాక‌్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) టీమ్ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇందులో భాగంగా సైబరాబాద్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో శనివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. పబ్‌లో జరిగిన డీజే పార్టీకి హాజరైన వారిలో 14 మంది అనుమానితులను గుర్తించి డ్రగ్ టెస్టులు చేసింది. అధునాతన టెస్ట్ కిట్లను ఉపయోగించి యూరిన్, లాలాజలం ద్వారా టెస్టులు చేయగా, 8 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే పట్టుబడినవారిలో ఐదుగురు స్వచ్ఛందంగా డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించగా, మరో ముగ్గురు మొదట్లో అంగీకరించలేదు.
దీంతో వేర్వేరు డ్రగ్ కిట్లను ఉపయోగించి టెస్టులు చేయగా డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ 8 మంది ఇప్పటికే ఈగల్ ఫోర్స్ అనుమానితుల లిస్టులో ఉన్నారు. ఈ మేరకు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కాగా, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నట్టు ఈగల్ ఫోర్స్ వెల్లడించింది. గత 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో మొత్తం 17 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 27 మంది డ్రగ్ పెడ్లర్లు, 17 మంది కస్టమర్లు సహా ఐదుగురు విదేశీ మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ దాడుల్లో 68 గ్రాముల కొకైన్, 50.5 గ్రాముల ఎండీఎంఏ , 2 గ్రాముల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 381.93 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
