ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు  ఏఎస్పీ సెల్యూట్.. ఆ తర్వాత ఏం జరిగింది..?

ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు  ఏఎస్పీ సెల్యూట్.. ఆ తర్వాత ఏం జరిగింది..?

స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్లక్ష్యంగా సెల్యూట్​ చేసినందుకు ఓ పోలీస్​ అధికారిపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. క్రమశిక్షణ చర్యల కింద అతనిపై బదిలీ వేటు వేశారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఆగస్టు 11వ తేదీన జరిగిన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి.. పౌరీ గర్వాల్ జిల్లా కోట్‌ద్వార్‌ ప్రాంతంలోని విపత్తు ప్రాంతాలను సందర్శించారు. ఆ సమయంలో కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. 

సీఎం ధామి రాక గురించి తెలియగానే స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్‌ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్లారు. ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌ నుంచి దిగిన సమయంలో ఏఎస్పీ శేఖర్ సుయాల్ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఒక చేతితో ఫోన్‌ను చెవిలో పెట్టుకునే మరో చేతితో సీఎం ధామికి సెల్యూట్‌ చేశారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఏఎస్పీ శేఖర్ సుయాల్ పై క్రమశిక్షణా చర్యల కింద బదిలీ వేటు వేశారు. నరేంద్రనగర్‌లోని పోలీస్‌ శిక్షణా కేంద్రానికి ట్రాన్స్​ ఫర్ చేశారు. ఆయన స్థానంలో కోట్‌ ద్వార్‌కు అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా జై బలూనిని నియమించారు.

ఉత్తరాఖండ్​ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తుండడంతో వరదలు సంభవించాయి. కోట్‌ ద్వార్‌లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో నీరంతా గ్రామాల్లోకి ప్రవేశించడంతో చాలా ఇండ్లు బురద నీటితో మునిగిపోయాయి. విపత్తు ప్రాంతాలను ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు.