- ఇద్దరి పరిస్థితి విషమం
- నల్గొండ పట్టణ శివారులో ప్రమాదం
నల్గొండ అర్బన్, వెలుగు: హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పల్టీకొట్టింది. దీంతో 13 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం శనివారం అర్ధరాత్రి నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరెంట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తోంది. శనివారం అర్ధరాత్రి 11.30 గంటల టైంలో నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్దకు చేరుకుంది.
అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడం, బస్సు స్పీడ్‌గా ఉండడంతో అదుపుతప్పి బారీకేడ్లను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులోని 13 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న నల్గొండ రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సైదాబాబు తెలిపారు.