
శ్రీనగర్: పహల్గామ్ దాడి నుంచి ఓ ప్రొఫెసర్ చాలా తెలివిగా వ్యవహరించి తనను, తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు. తన తోటివారితో కలిసి ఇస్లామిక్ శ్లోకం అయిన‘కలిమా’ను పఠించి ప్రాణాలతో బయటపడ్డాడు. అస్సాంలోని కచార్ జిల్లా సిల్చార్‌కు చెందిన దేబాశీశ్ భట్టాచార్య.. అస్సాం యూనివర్శిటీలో బెంగాలీ బోధించే ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్‌కు టూర్ వెళ్లారు.
మంగళవారం బైసరన్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. “ఓ టెర్రరిస్ట్ మా దగ్గరకు వచ్చి.. దాక్కుందామని ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని కాల్చి చంపాడు. దాంతో మాతోపాటున్న చాలా మంది ‘కలిమా’ పఠించడం మొదలుపెట్టారు. దాంతో నేను కూడా ‘లా ఇలాహి…’ అంటూ చదవడం మొదలుపెట్టాను. దీంతో ఆ టెర్రరిస్ట్ నన్ను వదిలేశాడు” అని భట్టాచార్య వివరించారు.
టెర్రర్ దాడి నుంచి బయటపడిన బాధితులు.. మన సైనికులను చూసి భయపడ్డారు. టెర్రరిస్టులు కూడా ఆర్మీ యూనిఫాం ధరించి రావడంతో నిజమైన సైనికులను చూసి వాళ్లు కూడా టెర్రరిస్టులే అనుకుని వణికిపోయారు. తమను, తమ పిల్లలను ఏమీ చేయవద్దంటూ చేతుల జోడించి వేడుకున్నారు. ఈ క్రమంలో జవాన్లు తాము నిజమైన సైనికులమని చెప్పి బాధితులకు భరోసా ఇచ్చారు.