హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌‌ కు అరుదైన గుర్తింపు

హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌‌ కు అరుదైన గుర్తింపు

హైదరాబాద్, వెలుగు:  ప్రయాణికుల వృద్ధి రేటు పరంగా జీఎంఆర్‌‌ హైదరాబాద్ ప్రపంచంలోనే 3వ ప్లేస్‌‌లో నిలిచింది. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) సెప్టెంబర్ 17న విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2018 సంవత్సరంలో ఏడాదికి 1.5 కోట్ల ప్రయాణికుల సంఖ్యను దాటిన  విమానాశ్రయాల జాబితాలో జీఎంఆర్‌‌ హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌‌ చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో గత ఏడాదితో పోలిస్తే 21.9 శాతం వృద్ధి రేటుతో హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌‌ ప్రపంచంలో మూడో స్థానంలో, ఇండియాలో రెండో స్థానంలో నిలిచింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న జీఎంఆర్‌‌ హైదరాబాద్  ఎయిర్‌‌పోర్ట్‌‌ ప్రపంచంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య డెస్టినేషన్- కమ్ -టూరిస్ట్  కేంద్రంగా మారుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌‌ నుంచి 29 ఎయిర్ లైన్స్ దేశీయంగా, అంతర్జాతీయంగా 69 ప్రదేశాలకు విమానాలను నడుపుతున్నాయి. 2015–19 మధ్యకాలంలో  జీఎంఆర్‌‌ హైదరాబాద్ విమానాశ్రయం ఏడాదికి సుమారు 20 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఇక్కడి నుంచి ప్రతి రోజు 60 వేల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు, 500కు పైగా విమానాల రాకపోకలు జరుగుతాయి.

గత ఏడాదిలో ఇక్కడి నుంచి అత్యధిక ప్రయాణికులు అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, థాయ్ ల్యాండ్ లకు వెళ్లగా, దేశీయంగా ఇక్కడి ప్రయాణికులు ప్రధానంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్ కతా, చెన్నైలకు ఎక్కువగా ప్రయాణించారు. ఇటీవల జీఎంఆర్‌‌ హైదరాబాద్  ఎయిర్‌‌పోర్ట్‌‌  ప్రభుత్వ డిజియాత్ర పథకం కింద దేశంలో మొట్టమొదటిసారిగా ఫేస్ రికగ్నిషన్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించిన మొదటి ఎయిర్‌‌పోర్ట్‌‌గా గుర్తింపు పొందింది. దేశంలో బ్యాగ్ ట్యాగ్ లను తొలగించిన మొదటి విమానాశ్రయం కూడా హైదరాబాదే. కేవలం హ్యాండ్ బ్యాగేజ్ తో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎక్స్ ప్రెస్ సెక్యూరిటీ చెకిన్ ప్రవేశపెట్టిన ఘనత కూడా మన హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌‌దే.  జీఎంఆర్‌‌ హైదరాబాద్  ఇంటర్నేషనల్‌‌ లిమిటెడ్ (జీహెచ్‌‌ఐఏఎల్‌‌)  జీఎంఆర్‌‌ గ్రూపు ఏర్పాటు చేసిన జాయింట్‌‌ వెంచర్‌‌.