ఆరు రోజుల వయసున్న చిన్నారిని మూడు లక్షలకు అమ్మకం.. ‌‌మెదక్‌‌‌‌ జిల్లాలో ఘటన

ఆరు రోజుల వయసున్న చిన్నారిని మూడు లక్షలకు అమ్మకం.. ‌‌మెదక్‌‌‌‌ జిల్లాలో ఘటన

మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాలో ఆరు రోజుల వయసున్న చిన్నారిని మధ్యవర్తుల సాయంతో తల్లిదండ్రులే రూ.3 లక్షలకు అమ్మేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మెదక్‌‌‌‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌‌‌‌ బుధవారం టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో వెల్లడించారు. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన డేగావత్‌‌‌‌ శిరీష, దేవీసింగ్‌‌‌‌ దంపతులకు ఇప్పటికే ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది.

మళ్లీ గర్భం దాల్చిన శిరీష మార్చి 27న మెదక్‌‌‌‌ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో డెలివరీ కాగా పాప పుట్టింది. దీంతో శిరీష, దేవీసింగ్‌‌‌‌ దంపతులు కొల్చారం, హవేళీఘనపూర్, వెల్దుర్తి మండలంలోని వివిధ తండాలకు చెందిన  సోనీ, రాజు, ప్రమీల, భాస్కర్‌‌‌‌తో పాటు నిర్మల్‌‌‌‌ జిల్లా ఆర్మూర్‌‌‌‌కు చెందిన మీడియేటర్‌‌‌‌ శారదతో కలిసి చిన్నారిని అమ్మేసేందుకు నిర్ణయించారు.

ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం అల్లినగర్‌‌‌‌కు చెందిన బొమ్మ లింగయ్య, కలవ్వ దంపతులకు ఏప్రిల్‌‌‌‌ 1న రూ. 3 లక్షలకు చిన్నారిని అమ్మేశారు. రూ. 3 లక్షల్లో శిరీష, దేవీసింగ్‌‌‌‌ దంపతులకు రూ.40 వేలు, ఇతర మధ్యవర్తులు ఒక్కొకరికీ రూ.10 వేల చొప్పున ఇచ్చి మిగతా డబ్బులను శారద తీసుకుంది. అనంతరం శిరీష, దేవీసింగ్‌‌‌‌ దంపతులు తమ గ్రామానికి వెళ్లిపోయారు. అయితే శిరీషకు పుట్టిన పాప కనిపించకపోవడంతో అనుమానించిన ఐసీడీఎస్ సూపర్‌‌‌‌వైజర్‌‌‌‌ బుధవారం మెదక్‌‌‌‌ టౌన్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మెదక్‌‌‌‌ టౌన్‌‌‌‌ సీఐ మహేశ్‌‌‌‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో శిశువు అమ్మకం విషయం వెలుగుచూసింది. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయగా... 9 మందిని అరెస్ట్ చేశామని, చిన్నారి తండ్రి దేవీసింగ్‌‌‌‌ పరారీలో ఉన్నాడని డీఎస్పీ వివరించారు. చిన్నారిని స్వాధీనం చేసుకొని ఐసీడీఎస్‌‌‌‌ ఆఫీసర్లకు అప్పగించినట్లు తెలిపారు.