డాక్టర్ నాకు క్యాన్సర్ ఉందని అమ్మనాన్నకు చెప్పొద్దు:ఆరేళ్ల చిన్నారి

డాక్టర్ నాకు క్యాన్సర్ ఉందని అమ్మనాన్నకు చెప్పొద్దు:ఆరేళ్ల చిన్నారి

మామూలుగా ఎవరైనా చనిపోతున్నారన్న విషయం ముందే తెలిస్తే ఎలా రియాక్టవుతారు..? అసలు ఆ విషయాన్నే తట్టుకోలేరు. అలాంటిది ఓ ఆరేళ్ల చిన్నారి మాత్రం తాను మరికొన్ని రోజుల్లో ఈ లోకం విడిచి వెళ్లిపోతానని తెలిసినా ఏ మాత్రం భయపడలేదు. అంతేకాదు ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పొద్దని, చెబితే వాళ్లు తట్టుకోలేరని తనకు ట్రీట్ మెంట్   చేస్తున్న డాక్టర్ కి చెప్పాడు. ఈ విషయాన్ని స్వయానా ఆ డాక్టరే ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డా.సుధీర్ కుమార్ షేర్ చేసిన ఈ ట్వీట్.. అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తోంది. 

తమ ఆరేళ్ల అబ్బాయిని తీసుకొని ఓ తల్లిదండ్రులు న్యూరాలజిస్ట్ డా.సుధీర్ కుమార్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆ చిన్నారికి క్యాన్సర్ అని తేలింది. అయితే ఆ విషయాన్ని తమ కుమారుడికి చెప్పొద్దని ఆ డాక్టర్ ను కోరారు. తన తల్లిదండ్రులు గది బయటికి వెళ్లిపోయాక.. వీల్ చెయిర్ లో ఉన్న మను డాక్టర్ తో మాట్లాడాడు. తాను ఈ వ్యాధి గురించి తెలుసుకున్నానని, ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు బతకనని తనకు తెలుసని చెప్పాడు. అంతేకాదు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పొద్దని, చెబితే వారు తట్టుకోలేరని ఆ చిన్నారి చెప్పిన మాటలకు డాక్టర్ చూస్తూ అలానే ఉండిపోయాడు. సరేనని చెప్పి వారిని అక్కడ్నుంచి పంపించారు.

అలా 9 నెలల గడిచిన తర్వాత మళ్లీ తనను ఆ దంపతులు కలిశారని డాక్టర్ చెప్పుకొచ్చాడు. మను గురించి వాళ్లను ఆరా తీయగా.. మను గత నెల క్రితమే చనిపోయాడని, ఈ 8 నెలలు అతడిని చాలా ఆనందంగా చూసుకున్నామని చెప్పినట్టు సుధీర్ తెలిపారు. డాక్టర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చిన్నారి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తనకు తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలను ప్రశంసిస్తూ.. మను ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.