ఉత్తర తెలంగాణలో పలుచోట్ల స్వల్ప భూకంపం

ఉత్తర తెలంగాణలో పలుచోట్ల స్వల్ప భూకంపం
  • సాయంత్రం 6.48 గంటలకు 3 సెకండ్లపాటు కంపించిన భూమి
  • రిక్టరు స్కేలుపై 4.3 తీవ్రతతో ప్రకంపనలు

హైదరాబాద్: ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 6.48 గంటల సమయంలో 2 నుంచి 3 సెకండ్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాతోపాటు జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు జరిగినట్లు సమాచారం. అలాగే మహారాష్ట్ర పరిధిలోని గడ్చిరోలి జిల్లాలో కూడా భూమి కంపించినట్లు సమాచారం.

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో భూకంపం సంభవించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. రామగుండం, లక్సెట్టిపేట, పెద్దపల్లి జిల్లాలోని రామగిరి, ముత్తారం మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఈ నెల 23వ తేదీన కూడా స్వల్ప భూకంపం నమోదైన విషయం తెలిసిందే. అప్పుడు రిక్టర్ స్కేల్ పై 4.3 గ నమోదు అయింది. ఈ ఘటన గడచి వారం రోజులు కాకముందే మరోసారి భూమి కంపించడంతో జనం ఉలిక్కిపడ్డారు. కొమురంభీం జిల్లా కౌటాలలో కూడా భూమి కంపించింది. రెండు మూడు సెకన్ల పాటు భూప్రకంపనలు జరగడంతో భయంతో జనం ఇండ్ల నుండి పరుగులు తీశారు. తెలంగాణలో భూకంపంపై  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పందించింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్లు ప్రకటించింది. 

గడ్చిరోలిలో భూకంప కేంద్రం
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. భారత కాలమానం ప్రకారం 6 గంటల 48 నిమిషాల 47 సెకండ్లకు భూమి స్వల్పంగా కంపించిందని వెల్లడించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారిక ప్రకటన చేసింది.